వైరల్‌ వీడియో: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌పై దాడి?

Fact Check: Ajay Devgn Not Beaten Up Outside Pub In Delhi - Sakshi

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ మీద దాడి చేసినట్లు ఓ వార్త విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ మేరకు కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి కొట్టినట్లు ఓ వీడియో కూడా నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోని ఏరోసిటీ పబ్‌ బయట ఓ వ్యక్తితో కొందరు ఘర్షణకు దిగడమే కాక అతడిని చితకబాదారు. అందులోని బాధితుడు అజయ్‌ దేవ్‌గణ్‌ అని భ్రమపడిన అభిమానులు తమ హీరోకు ఏమైందో? ఎలా ఉందోనని తీవ్ర ఆందోళన చెందారు.

ఈ నేపథ్యంలో అజయ్‌ దేవ్‌గణ్‌ టీమ్‌ స్పందిస్తూ ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. "గతేడాది జనవరిలో జరిగిన తానాజీ: ద అన్‌సంగ్‌ వారియర్‌ ప్రమోషన్స్‌ తర్వాత ఇప్పటివరకు అజయ్‌ ఢిల్లీకి వెళ్లనేలేదు. కాబట్టి ఢిల్లీలోని పబ్‌ బయట అజయ్‌ మీద దాడి జరిగిందన్న వార్తలు పూర్తిగా నిరాధారం, అసత్యమైనవి. ఆయన 'మైదాన్‌', 'గంగూబాయ్‌ కథియావాడి', 'మేడే' చిత్రాల షూటింగ్‌ కోసం కొన్ని నెలలుగా ముంబైలోనే ఉంటున్నారు. అతడు ఢిల్లీకి వెళ్లి దాదాపు 14 నెలలవుతోంది. కాబట్టి దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి' అని అజయ్‌ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా ఢిల్లీలోని పబ్‌ బయట రెండు వాహనాలు ఒకదానికొకటి తగలడంతో రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి. చిలికి చిలికి గాలివానలా మారిన ఈ గొడవ కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

చదవండి: 'అజయ్‌ దేవ్‌గణ్, నీకు సిగ్గనిపించడం లేదా?'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top