‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ రివ్యూ

Ee Kathalo Paathralu Kalpitam Telugu Movie Review And Rating - Sakshi

టైటిల్‌ : ఈ కథలో పాత్రలు కల్పితం
నటీనటులు :  ప‌వ‌న్‌తేజ్‌, మేఘ‌న‌, పృథ్వీ, ర‌ఘుబాబు, న‌వీన్, అభ‌య్ సింగ్‌, నోయెల్ త‌దిత‌రులు 
నిర్మాణ సంస్థ : ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : రాజేష్‌ నాయుడు 
దర్శకత్వం : అభిరామ్ ఎమ్
సంగీతం : కార్తీక్‌ కొడకండ్ల
సినిమాటోగ్రఫీ : సునీల్‌ కుమార్‌.ఎన్
ఎడిటింగ్‌ : శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు
విడుదల తేది : మార్చి 26, 2021

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పది మందికి పైగా హీరోలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతనే పవన్‌ తేజ్‌ కొణిదెల. ఆయన హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. అభిరామ్. ఎమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ
కృష్ణ (ప‌వ‌న్ తేజ్‌)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా హీరో కావాలనుకుంటాడు. ఇండస్ట్రీ వాళ్లతో టచ్‌లో ఉంటే సినిమా చాన్స్‌లు వస్తాయని త‌న స్నేహితుడు నిర్మాత ర‌త్నం (ర‌ఘుబాబు) ద‌గ్గ‌ర మేనేజ‌ర్‌గా వుంటాడు. అత‌నికి ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్న శృతి (మేఘ‌న కుమార్‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ఇదిలా ఉంటే.. చాలా రోజుల తర్వాత కృష్ణకు ఓ సినిమాలో హీరోగా అవకాశం వస్తుంది. ఆ మూవీ ఓ పాపుల‌ర్ మోడ‌ల్ య‌దార్థ క‌థ నేప‌థ్యంలో రూపొందిస్తుంటారు. ఇంత‌కీ ఆ మెడ‌ల్ ఎవ‌రు? ఆమె వెన‌కున్న క‌థేంటీ? హీరో కృష్ణకి మోడల్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతా కథ.

నటీనటులు
పవన్‌ తేజ్‌కి తొలి సినిమా ఇది. ​కానీ సగటు ప్రేక్షకులు పవన్‌ తేజ్‌కు ఇది తొలి సినిమా అని గుర్తుపట్టలేరు. అంతలా నటించాడు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్ ప‌లికిన తీరు బాగుంది. డ్యాన్స్‌, ఫైట్స్‌ కూడా ఇరగదీశాడు. హీరోయిన్‌ మేఘన అందం, అభినయం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. హీరోయిన్‌ శృతి పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమాలో హీరో కృష్ణ తర్వాత బాగా పండిన పాత్ర ‘పెళ్లి’ ఫస్త్రమ్‌ పృథ్వీది. ఏసీపీ పాత్రలో తనదైన నటనను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు.తన అనుభవం తెరపై  స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాత రియ‌ల్ ర‌త్నం పాత్ర‌లో ర‌ఘుబాబు న‌వ్వించారు. సింగ‌ర్ నోయెల్ విల‌న్‌గా అల‌రించారు. మిగ‌తా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

విశ్లేషణ
థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన చిత్రం ఇది. ఇలాంటి చిత్రాలపై టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నమ్మకంతోనే అరణ్య, రంగ్‌దే లాంటి పెద్ద సినిమాలో పోటీలో ఉన్నా.. తమ చిత్రాన్ని ధైర్యంగా విడుదల చేశారు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ నిర్మాతలు. కథను నమ్ముకొని తీసిని సినిమా ఇది. అనుకున్న పాయింట్‌ను తెరపై చూపించడంలో సఫలం అయ్యాడు దర్శకుడు భిరామ్. ఎమ్‌. ఒక‌వైపు స‌స్పెన్స్ మ‌రోవైపు ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేల‌న్స్ చేస్తూ ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు. నేడు సమాజంలో జరుగుతున్నా విమెన్ ట్రాఫికింగ్ ను ఎంచుకుని దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం బాగుంది. క‌థ‌ని అనేక మ‌లుపుల‌తో న‌డిపించిన తీరు ఆస‌క్తిని రేకెత్తించేలా ఉంది. సెకండాఫ్‌లోని వచ్చే కొన్ని ట్వీస్టులు ప్రేక్షకుడిని థ్రిల్‌ చేస్తాయి.. ప‌వ‌న్‌తేజ్, పృథ్వీల‌ న‌ట‌న సినిమాకు చాలా ప్లస్‌ అయిందని చెప్పొచ్చు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం కార్తీక్ కొడ‌కండ్ల‌ సంగీతం. పాటలతో పాటు నేప‌థ్య సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. కొన్ని కీలక సన్నివేశాలు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు ఎడిటింగ్‌ పర్వాలేదు. సునీల్‌ కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. చాలా సీన్స్ చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top