ఈ వారం థియేటర్లలోకి అరడజనుకు పైగానే సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని చిత్రాలపై రిలీజ్‌కు ముందు మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల నుంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ వారం బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా నిరాశే మిగిలింది.
ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజల్ నటించిన ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవరించాడు. ఆయన కొడుకు ఎస్. ఎస్. కార్తికేయ నిర్మించాడు. అందుకే ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే నెగిటీవ్ టాక్ మూటగట్టుకొంది. అసలు కార్తికేయ ఈ చిత్రాన్ని ఎందుకు నిర్మించాలకున్నాడు? కొడుకు డెబ్యూ ఫిల్మ్‌ని రాజమౌళి ఇలా ప్లాన్ చేస్తాడా? అనే విమర్శలు వచ్చాయి.
(చదవండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ)
ఇంచుమించు ఇలాంటి కామెంట్సే ‘సిగ్మా’ చిత్రంపై వచ్చాయి. తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం కావడంతో ‘సిగ్మా’పై ముందే ఆసక్తి నెలకొంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. తెలుగులోనే కాదు తమిళనాట కూడా పెద్దగా ఆడడం లేదు.
(చదవండి: సిగ్మా మూవీ రివ్యూ)
ఇక కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం డోరతీ ఈ వారమే తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా..టికెట్స్ మాత్రం పెద్దగా తెగడం లేదు. ఇక ఈ వారం సినిమాల్లో గట్టిన ప్రమోషన్స్ చేసిన సినిమా ‘తెల్లకాగితం’. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రానికి కూడా మిశ్రమ స్పందననే లభించింది. ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమి లేదని..పలు పాత్ర చిత్రాలను గుర్తు చేస్తుదంటూ సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. అందుకే రెండో రోజు నుంచి ఈ సినిమా టికెట్స్ పెద్దగా తెగడం లేదు.
(చదవండి: 'తెల్లకాగితం' మూవీ రివ్యూ)
గ్రామీణ నేపథ్యంలో రూరల్ మాఫియా, లోకల్ గ్యాంగ్ వార్, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కిన ‘అనకాపల్లి’ కూడా ప్రేక్షకులను థియేటర్లకు పెద్ద సంఖ్యలో రప్పించలేకపోయింది. ఇదే వారంలో వచ్చిన మరో తెలుగు చిత్రం ‘తత్వం’. పెద్ద స్టార్లు లేకపోవడం, భారీ ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా జనాలకు పెద్దగా తెలియదు. ఇక కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన పల్లెటూరి ప్రేమకథ ‘ప్రేమద ఊరలి’ మూవీ.. ‘ప్రేమనే ఊరిలో’పేరుతో తెలుగులో ఈ శుక్రవారం(అక్టోబర్ 2) రిలీజ్ అయింది. ఉన్నంతలో కొంతవరకు ఈ సినిమా కాస్త బెటర్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రమోషన్స్ సరిగా చేయకపోవడంతో ఇలాంటి ఒక సినిమా వచ్చిందన్న విషయమే ఇప్పటికీ చాలా మందికి తెలియదు. మొత్తంగా చూస్తే.. ఈ వారం వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చాయి.


