
‘‘కథపై నమ్మకంతో ‘బకాసుర రెస్టారెంట్’(Bakasura Restaurant Movie) సినిమా చేశాం. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా లాభాలు వస్తాయన్న గ్యారంటీ లేని రోజులు ఇవి. అందుకే మేం మేకింగ్ పరంగా ఖర్చుపెట్టాం. కంటెంట్ బాగుంటే సినిమాలు సూపర్‌హిట్ అవుతాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. అలా మా చిత్రం కూడా విజయం సాధి స్తుంది’’ అని దర్శకుడు ఎస్‌జే శివ తెలిపారు. ప్రవీణ్ ప్రధాన పాత్రలో, ‘వైవా’ హర్ష టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్‌జే మూవీస్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థిన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఎస్‌జే శివ మాట్లాడుతూ–‘‘లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశాను. ‘విరూపాక్ష’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. గతంలో మా నాన్నగారు కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన ఆకాంక్ష మేరకే నేను దర్శకుడిగా, అన్నయ్య నిర్మాతగా మారాం. కొత్త తరహా జోనర్‌లో హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘బకాసుర రెస్టారెంట్’ తీశాం.
గతంలో ప్రేక్షకులను అలరించిన ‘యమలీల, ఘటోత్కచుడు’ సినిమాల్లా ఆడియన్స్ ని థ్రిల్లింగ్‌కు గురిచేసే సినిమా ఇది. ఐదుగురు బ్యాచిలర్స్ మధ్య జరిగే వినోదాత్మక కథ. మన జీవితంలోకి ఓ తిండిపోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి? అనేది పాయింట్. నా కొత్త సినిమా నా బ్యానర్‌లో ఉండదు. కొత్త దర్శకులను పరిచయం కోసమే ఎస్‌జే మూవీస్‌ని ప్రారంభించాం’’ అన్నారు.