'ఓటీటీలో డైరెక్ట్‌గా మూవీ రిలీజ్.. మాకు అనుమతి లేదు' | Diljit Dosanjh reacts as fan asks why Satluj chose OTT over theatres | Sakshi
Sakshi News home page

Diljit Dosanjh: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్.. హీరో ఏమన్నారంటే?

Jul 6 2026 4:27 PM | Updated on Jul 6 2026 4:35 PM

Diljit Dosanjh reacts as fan asks why Satluj chose OTT over theatres

పంజాబ్‌కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'పంజాబ్ 95'. ఈ మూవీకి హనీ టెహ్రాన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ హీరోగా చేశారు. ఈ సినిమాని మూడేళ్ల క్రితమే తీసినప్పటికీ సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. మూవీ టీమ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఫలితం లేకపోవడంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయలేదు. ఇటీవల 'సత్లుజ్'గా టైటిల్ మార్చి నేరుగా జీ5లో రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

కానీ ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే ఈ మూవీని తొలగించారు. ఈ మూవీపై వివాదం తలెత్తడంతో ఓటీటీ సంస్థ తొలగించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై దిల్జీత్ దోసాంజ్ స్పందించారు. ఈ చిత్రం రిలీజ్‌కు నిర్మాతలు ఏళ్ల తరబడి అడ్డంకులను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేవరకు  మాట్లాడటానికి మాకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి అనే కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మూవీ ఓటీటీలో ప్రీమియర్ అయ్యే వరకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వెల్లడించారు.

దిల్జీత్ మాట్లాడుతూ.. "నిన్నటి వరకు ఈ సినిమా గురించి ఎవరితోనూ మాట్లాడటానికి నాకు అనుమతి లేదు. ఎలాంటి ప్రచారం లేకుండా సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? చిత్ర బృందం మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. తాను మాట్లాడాలనుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ప్రేక్షకుల మద్దతుకు ధన్యవాదాలు. అభిమానులు సోషల్ మీడియాలో సినిమా గురించి పంచుకుంటున్న వీడియోలు, పోస్ట్‌లను తాను చూశా. ఈ మూవీ సంఘటన 1995లో జరిగింది. అప్పట్లో దాని గురించి మాట్లాడటానికి ప్రజలను అనుమతించేవారు కాదు. అదే పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. ఇది చాలా బాధాకరం' అని  చెప్పారు. 2026లో కూడా పెద్దగా మార్పు రాలేదనే విషయం తనను నిరాశకు గురిచేసిందని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి చాలా కారణాల ఉన్నాయని దిల్జీత్ గుర్తుచేసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ 10-15 ఏళ్ల పాటు నిలిచిపోయిందన్నారు. నిర్మాణం ప్రారంభించడానికి మరో ఏడాదిన్నర పట్టిందని.. ఎడిటింగ్ తర్వాత ప్రాజెక్ట్ నాలుగేళ్లపాటు నిలిచిపోయిందని ఆయన చెప్పారు. తనకు ఈ చిత్రంతో రెండేళ్లపాటు అనుబంధం కలిగి ఉండగా, దర్శకుడు హనీ ట్రెహాన్ దీనికి ప్రాణం పోయడానికి ఆరేళ్లు వెచ్చించారని దిల్జిత్ తెలిపారు.

సత్లుజ్ మూవీ కథేంటంటే...

హనీ ట్రెహన్ దర్శకత్వం వహించిన సత్లుజ్ మూవీని 1984 నుంచి 1994 మధ్య పంజాబ్‌లో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను దహనం చేశారనే రియల్ స్టోరీ అధారంగా తెరకెక్కించారు. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించారు. పంజాబ్‌లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యారు. ఈయన్ని పోలీసులే చంపారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ చిత్రానికి 2022లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ లభించలేదు. సెన్సార్ బోర్డ్ ఏకంగా 127 కట్స్ కోరారని చిత్రనిర్మాతలు ఆరోపించారు. ఇది 2023లో టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడాల్సి ఉండగా.. భారత అధికారులు అభ్యంతరాలు లేవనెత్తడంతో ప్రదర్శన రద్దు చేశారు.

దీంతో చివరకు జూలై 3న ఎలాంటి ప్రకటన లేకుండా నేరుగా జీ5లో ప్రదర్శించారు. రెండు రోజుల తర్వాతే ముందస్తు నోటీసు లేకుండా దానిని ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించారు. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్‌తో పాటు అర్జున్ రాంపాల్, కన్వల్‌జిత్ సింగ్, సువీందర్ విక్కీ, గీతిక విద్యా ఓహ్లియన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement