Acharya: ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్‌, ఆచార్య బయటపడేనా?

Did Rajamouli Heroes Flop Sentiment Effects Acharya Movie - Sakshi

మల్టీస్టారర్‌ అంటేనే ప్రేక్షకుడు ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్తాడు. అలాంటిది మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ఒకే సినిమాలో ఉన్నారంటే హైప్‌ ఏ రేంజ్‌లో ఉంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరు, చరణ్‌ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడు (ఏప్రిల్‌ 29న) రిలీజైంది. ఇప్పటికే సినిమా చూసిన పలువురు వారి అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా బాగుందని కొందరు, యావరేజ్‌, బాగోలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

రాజమౌళి వల్లే ఆచార్యకు ఇలాంటి ఫలితం వస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆచార్యకు, రాజమౌళికి సంబంధం ఏంటంటారా? మరేం లేదు. రాజమౌళి కెరీర్‌లో తీసిన ప్రతి సినిమా సూపర్‌ హిట్టే. అందులో డౌటే లేదు. ఎంతోమంది హీరోలకు విజయాలను అందించి స్టార్లుగా నిలబెట్టాడు జక్కన్న. అయితే రాజమౌళితో హిట్‌ అందుకున్న హీరోలు నెక్స్ట్‌ ఏ సినిమా చేసినా అది ఫ్లాప్‌ అవుతుందన్న సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో ఉంది.

ఉదాహరణకు 2001లో ఎన్టీఆర్‌- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం స్టూడెంట్‌ నెంబర్‌ 1. ఇది ఎంత హిట్‌ అయ్యిందో మనందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సుబ్బు సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే జక్కన్నతో సింహాద్రి తీసి సక్సెస్‌ కొట్టిన తారక్, ఆ తర్వాత చేసిన ఆంధ్రావాలా పెద్దగా ఆడలేదు. మరోసారి జక్కన్నతో కలిసి యమదొంగ చేశాడు ఎన్టీఆర్‌. ఇదీ సూపర్‌ హిట్టే కానీ ఆ తర్వాత చేసిన కంత్రీ అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ప్రభాస్‌తో బాహుబలి, బాహుబలి 2 చేసి పాన్‌ ఇండియా హిట్స్‌ ఇచ్చాడు రాజమౌళి. కానీ ఆ తర్వాత ప్రభాస్‌ చేసిన సాహో తీవ్ర నిరాశను మిగిల్చింది.

2009లో రామ్‌చరణ్‌తో మగధీర తీసి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు రాజమౌళి. కానీ ఆ మరుసటి ఏడాది రిలీజైన చరణ్‌ మూవీ 'ఆరెంజ్‌' తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇటీవల రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ తీసి ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు రాజమౌళి. దీంతో చరణ్‌, తారక్‌ల తర్వాతి సినిమాల పరిస్థితి ఏంటా? అని అందరూ చర్చలు మొదలుపెట్టారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవి ఈ సెంటిమెంట్‌ గురించి మాట్లాడుతూ తాను అలాంటివి నమ్మనని కుండ బద్ధలు కొట్టేశాడు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్‌ వస్తుందని అందరూ అనుకుంటారని, ఆ ఊహను ‘ఆచార్య’ తుడిచిపెట్టేస్తుందని భరోసా ఇచ్చారు. మరి చిరు చెప్పినట్లే ఆచార్య ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.

చదవండి: ‘ఆచార్య’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top