దేవిశ్రీని పక్కన పెట్టిన సుక్కు.. రామ్‌చరణ్‌ సినిమాకు కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌! | Devi Sri Prasad Fans Fires On Sukumar, For Select New Music Director TO Ram Charan Movie | Sakshi
Sakshi News home page

దేవిశ్రీని పక్కన పెట్టిన సుకుమార్‌.. రామ్‌చరణ్‌ సినిమాకు కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌!

Sep 14 2026 10:46 AM | Updated on Sep 14 2026 11:36 AM

Devi Sri Prasad Fans Fires On Sukumar, For Select New Music Director TO Ram Charan Movie

సినిమా హిట్‌లో దర్శకుడి విజన్‌ ఎంత కీలకమో.. దానికి తగ్గట్టుగా ఆ విజన్‌ను తెరపై ఆవిష్కరించే టెక్నీషియన్ల పాత్ర కూడా అంతే కీలకం. అందుకే కొందరు దర్శకులు తమకు బాగా సింక్‌ అయ్యే టెక్నీషియన్లను ఎప్పటికీ వదులుకోరు. ముఖ్యంగా సంగీత దర్శకుల విషయంలో ఈ కాంబినేషన్లు మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి. టాలీవుడ్‌లో ఇలాంటి కాంబినేషన్‌ అంటే వెంటనే గుర్తొచ్చే జోడీల్లో రాజమౌళి-కీరవాణి, సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌ ముందుంటారు. అయితే ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్లలో ఒకదానికి బ్రేక్‌ పడబోతోందనే ప్రచారం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది.

రాజమౌళి మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కీరవాణితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సుకుమార్‌ కూడా దాదాపు తన కెరీర్‌ ఆరంభం నుంచి దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేస్తూ వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. అందుకే సుకుమార్‌ సినిమా అంటే దేవిశ్రీ సంగీతం తప్ప మరొకరిని ఊహించడం కూడా కష్టమే అన్నంతగా వీరి కాంబినేషన్‌ ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసింది.

(ఇదీ చదవండి: సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!)

అయితే ఇప్పుడు సుకుమార్‌ మాత్రం ఈ కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వస్తున్నారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. రామ్‌చరణ్‌తో సుకుమార్‌ చేయబోయే కొత్త సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో ‘దురంధర్‌’ ఫేమ్‌ శశ్వత్‌ సచ్‌దేవ్‌ను సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ వార్త మాత్రం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్‌-దేవిశ్రీల మధ్య గ్యాప్‌ వచ్చిందనే ప్రచారం జరిగింది. ఈ సినిమాలో కొంత భాగం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను సామ్‌ సీఎస్‌తో చేయించుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాకు కూడా దేవిశ్రీ కాకుండా మరో సంగీత దర్శకుడిని ఎంచుకుంటున్నారనే వార్తలు రావడంతో.. ఈ ఇద్దరి మధ్య నిజంగానే దూరం పెరిగిందా? అనే చర్చ మొదలైంది.

ఈ ప్రచారం దేవిశ్రీ ప్రసాద్‌ అభిమానులను మాత్రం తీవ్రంగా అసంతృప్తికి గురిచేస్తోంది. మొదటి నుంచి దేవితో కలిసి ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్స్‌ అందించిన సుకుమార్‌.. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్‌ సినిమాల విజయాల్లో దేవిశ్రీ పాత్రను గుర్తు చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్‌-దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’, ‘జగడం’, ‘ఆర్య 2’, ‘1 నేనొక్కడినే’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాల్లో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. వాటి పాటలు, నేపథ్య సంగీతానికి మంచి స్పందన లభించింది. అందుకే సుకుమార్‌ సినిమాలకు దేవిశ్రీ ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదని, ఆయన సినిమాటిక్‌ విజన్‌ను అర్థం చేసుకున్న కీలక భాగస్వామి అని అభిమానులు చెబుతున్నారు.

అయితే దేవిశ్రీ ప్రసాద్‌ ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం వల్లే సుకుమార్‌ మరో సంగీత దర్శకుడిని ఎంచుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ దేవిశ్రీ ఇతర ప్రాజెక్టులకు సంగీతం అందిస్తుండటాన్ని ఉదాహరణగా చూపిస్తూ అభిమానులు ఈ కారణాన్ని అంగీకరించడం లేదు. అసలు కారణం మరేదైనా ఉందా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌కు నిజంగానే బ్రేక్‌ పడుతుందా? రామ్‌చరణ్‌-సుకుమార్‌ కొత్త సినిమాకు శశ్వత్‌ సచ్‌దేవ్‌ సంగీతం అందించనున్నారా? అన్నది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఈ కాంబినేషన్‌ మార్పుపై జరుగుతున్న ప్రచారం మాత్రం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement