హైదరాబాద్‌: ఆ ఐదు సినిమా థియేటర్లు క్లోజ్‌!

Corona Effect Five Movie Theaters Have Closed Permanently In Hyderabad - Sakshi

కరోనా కారణంగా తెలంగాణలో దాదాపు 10 నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రేక్షకులు వినోదానికి దూరమయ్యారు. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్లను ఓపెన్‌ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో మూతపడిన సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి 50 శాతం సీటింగ్‌తో సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఇక థీయేటర్లకు వెళ్లి హ్యాపీగా సినిమా చూద్దామనుకున్న తరుణంలో సినీ ప్రియులకు సంబంధించిన ఒక చేదు వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హైదరాబాద్‌లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లగా మంచి గుర్తింపు పొందిన ఐదు సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
(చదవండి : టాలీవుడ్‌కు వరాల జల్లు; కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు

మల్టీప్లెక్స్‌ల హవా నడుస్తున్న కాలంలోనూ పెద్ద పెద్ద సినిమాలు రీలీజ్‌ చేస్తూ సామాన్యులను వెండితెరకు దగ్గర చేసిన గెలాక్సీ థియేటర్‌(టోలిచౌకి), శ్రీ రామ థియేటర్(బహదూర్‌పుర), అంబ థియేటర్‌(మెహదీపట్నం), శ్రీమయూరి థియేటర్‌(ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌), శాంతి థియేటర్‌(నారాయణగూడ) మూతపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మల్టీప్లెక్స్‌ల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఈ ఐదు థియేటర్ల యజమానులు పెద్ద సినిమాలను విడుదల చేస్తూ సామాన్య సినీ అభిమానులకు తోడుగా నిలిచారు. ముఖ్యంగా శాంతి, గెలాక్సీ థియేటర్లలో కొన్ని దశాబ్దాలుగా  ఎన్నొన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను విడుదల చేశారు. మల్టీపెక్స్‌ల హవాలోనూ ఎక్కడా రాజీ పడకుండా పెద్ద పెద్ద చిత్రాలను నడిపించారు. కానీ దురదృష్టవశాత్తు  కరోనా కారణంగా గత 10 నెలలుగా థీయేటర్లు మూతపడటం, సింగిల్‌ స్క్రీన్లకు ఈ మధ్యకాలంలో సరైన ఆదాయం లేకపోవడంతో మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలాన్ని  ఫంక్షన్‌ హాల్‌ లేదా ఇత వాణిజ్య సముదాయాలుగా మార్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top