CM M. K. Stalin: నేనూ సినిమాల్లో నటించా, చిత్ర పరిశ్రమ ఐక్యతకు సహకారం అందిస్తా

CM Stalin Launches South India Media And Entertainment Summit - Sakshi

చెన్నై సినిమా: తమిళ సినిమా రంగం దేశంలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ పేర్కొన్నారు. సౌత్‌ ఇండియా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (సదస్సు) శనివారం ఉదయం చెన్నైలో మొదలైంది. స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించానని పేర్కొన్నారు. తమిళ సినిమా భారతీయ సినిమాలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ ఐక్యతకు తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈతరం యువత గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని, అలాంటి వాటిపై సినిమాల్లో అవగాహన కలిగించే విధంగా సంభాషణలు పొందుపరచాలని సీఎం స్టాలిన్‌ తెలిపారు. 

దక్షిణ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సత్యజ్యోతి ఫిలిమ్స్‌ త్యాగరాజన్‌ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు దర్శకుడు మణిరత్నం, నటుడు జయంరవి, టాలీవుడ్‌ నుంచి డైరెక్టర్‌ రాజమౌళి, సుకుమార్, మల్లువుడ్‌ నుంచి నటుడు జయరాం, ఫాహత్‌ ఫాజిల్, శాండిల్‌వుడ్‌ నుంచి శివరాజ్‌కుమార్‌ మొదలగు 300 మందికి పైగా పాల్గొని సినిమాకు చెందిన వివిధ అంశాలపై ప్రసంగించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సినిమా మార్కెట్‌ విస్తరణ, ఓటీటీ ప్రభావంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top