
చిరంజీవి సరసన మాళవికా మోహనన్ నటించనున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర)ల కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. కెవిన్ ప్రోడక్షన్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. చిరంజీవి కెరీర్‌లోని 158వ సినిమా ఇది. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందని, ఒక హీరోయిన్‌గా మాళవికా మోహనన్, మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది.
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా కథనం ఉంటుందని, అతి త్వరలోనే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై ఓ స్పష్టత రానుందని సమాచారం. మరి... చిరంజీవి సరసన రాశీ ఖన్నా, మాళవికాలకు హీరోయిన్లుగా నటించే చాన్స్ లభిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు మాళవికా మోహనన్. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది.