
ఏ ఇండస్ట్రీలోనైనా ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించిన మల్టీస్టారర్ ట్రెండ్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఒక సినిమాలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కవ స్టార్స్ నటిస్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితులు తగ్గిపోతున్న ఈ తరుణంలో టాప్ హీరోలు ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం ఓ మంచి పరిణామమే. ఇలా తాజాగా ‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటూ ఆడియన్స్ ముందుకు రానున్న కొన్ని మల్టీస్టారర్ తరహా సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం
సీనియర్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్ ఒకే సినిమాలో స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ సూపర్‌గా ఎగ్జైట్ అవుతారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకు రానున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోనే వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో వెంకటేశ్ కూడా కన్ఫార్మ్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. నాలుగో షెడ్యూల్ కోసం అతి త్వరలోనే కొచ్చి వెళ్లనుంది యూనిట్. అక్కడ చిరంజీవి – నయనతార కాంబినేషన్‌లో ఓ సాంగ్ చిత్రీకరణ, కొంత టాకీ పార్టు, ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరిగే కొత్త షూటింగ్ షెడ్యూల్‌లో వెంకటేశ్ రాకను అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్.
ఇక ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు) అనే డ్రిల్ మాస్టర్‌గా చిరంజీవి, ఆయన భార్య పాత్రలో నయనతార కనిపిస్తారని తెలిసింది. వెంకటేశ్ ΄పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘మన శివశంకర వరప్రసాద్‌గారు, సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది.
సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా యాక్షన్ జానర్ కాదు... దీంతో స్క్రీన్‌పై చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ఫన్‌ను జనరేట్ చేయబోతున్నారనే అంశాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది.
చారిత్రక చిత్రంలో...
మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేశ్ ముందుంటారు. గతంలో రామ్‌తో కలిసి ‘మసాలా’, పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు చేశారు వెంకటేశ్. అయితే వెంకీ తాజాగా మరో పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో భాగంగా తానో పెద్ద స్టార్‌తో కలిసి సినిమా చేయబోతున్నానని చెప్పేశారు. ఈ వేడుకలకు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. దీంతో వెంకటేశ్–బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ కన్ఫార్మ్ అయిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. తనకు ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేనితో ‘గౌతమి పుత్రశాతకర్ణి’ తరహాలో బాలకృష్ణ ఓ వార్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలోనే వెంకటేశ్ ఓ లీడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు.
కూలీతో కొట్లాట
యాక్టర్‌గా కెరీర్‌లో నాగార్జున కాస్త రూట్ మార్చినట్లుగా ఉన్నారు. ఇటీవల ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమా చేశారు. ఈ సినిమాలో దీపక్ పాత్రలో నాగార్జున మెప్పించారు. అయితే ఇలాంటి కీలక తరహా పాత్రనే ‘కూలీ’ సినిమాలోనూ చేశారు. రజనీకాంత్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగార్జున మరో లీడ్ రోల్‌లో కనిపిస్తారు. దేవ ΄ాత్రలో రజనీకాంత్ నటించగా, సైమన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. అయితే సైమన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సినిమాలో రజనీ–నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉంటాయట.
అలాగే ఈ ‘కూలీ’ సినిమాలోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ‘దహా’ అనే ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర ‘కూలీ’ కథను కీలక మలుపు తిప్పుతుందని తెలిసింది. ఇంకా ఇదే చిత్రంలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ‘మోనిక’ అనే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చేశారు. రజనీకాంత్–నాగార్జున–ఆమిర్ ఖాన్–ఉపేంద్ర–శ్రుతీహాసన్... ఇలాంటి టాప్ యాక్టర్స్‌తో ‘కూలీ’ ఓ పర్‌ఫెక్ట్ మల్టీస్టారర్ సినిమాకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.
సీక్వెల్ సిద్ధమౌతోంది!
ప్రభాస్ మెయిన్ లీడ్‌గా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్, ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షనల్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్‌ల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాయి.
ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్ షూటింగ్ ఈ సెప్టెంబరులో ప్రారంభం కానుందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అశ్వనీదత్. ఈ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ చిత్రంలో కూడా ప్రభాస్ పాత్రకు దీటుగానే అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్‌హాసన్‌ల పాత్రలు ఉంటా యని తెలిసింది. తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’లో కనిపించిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీల రోల్స్ కూడా సీక్వెల్‌లో మరింత నిడివి ఎక్కువగా కనిపించనున్నాయట. ఇలా ఈ సీక్వెల్ ఓ పర్‌ఫెక్ట్ మల్టీస్టారర్‌గా ఆడియన్స్‌ను అలరించనుందనడంలో సందేహం లేదు.
బాలీవుడ్ వార్
నార్త్‌లో హృతిక్ రోషన్ సూపర్ స్టార్. సౌత్‌లో ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చేసిన భారీ యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ డ్రామా సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ మరో లీడ్ రోల్ చేశారు. ఎన్టీఆర్‌కు తొలి స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ కూడా ‘వార్ 2’యే కావడం విశేషం. ఇటీవల ఈ ‘వార్ 2’ సినిమా నుంచి విడుదలైన టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు సినిమా లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్–ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు యాక్షన్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయనిపిస్తోంది.
అంతేకాదు... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మధ్య ఓ సూపర్ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్. ఇలా సినిమా లవర్స్‌కు ‘వార్ 2’ ఓ పర్‌ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీగా కనిపిస్తోంది. వైఆర్‌ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూ΄÷ందిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
ఇక ఈ ‘వైఆర్‌ఎఫ్’ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్, టైగర్ జిందా హై’, హృతిక్ రోషన్ – టైగర్ ఫ్రాష్‌ల ‘వార్’, షారుక్ ఖాన్ ‘పఠాన్’ వంటి సినిమాలొచ్చాయి. హీరోయిన్స్ ఆలియా భట్–శార్వరీ చేసిన ‘ఆల్ఫా’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కాగా ‘వార్ 2’ కూడా ‘వైఆర్‌ఎఫ్’ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న సినిమాయే కనుక ఈ యూనివర్స్‌లోని ఇతర చిత్రాల్లో హీరోలుగా నటించిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో కనిపించే చాన్స్ ఉందట. ఇదే జరిగితే... యాక్షన్ లవర్స్‌కి ‘వార్ 2’ మరింత మజానిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చో్ర΄ా ఈ సినిమాను నిర్మించారు.
హీరో వర్సెస్ ఫ్యాన్
కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ కన్నడ హీరో తాజాగా నటిస్తున్న తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఇందులో రామ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ సినీ సూపర్ స్టార్ హీరో, అతని ఫ్యాన్‌కి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో సూపర్‌స్టార్ సూర్యకుమార్ ΄ాత్రలో ఉపేంద్ర, సూర్యకుమార్ అభిమాని ΄ాత్రలో రామ్ కనిపిస్తారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నైట్ షూట్‌లో రామ్–భాగ్యశ్రీలపై లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరిగతిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ ఓ ΄ాట రాశారని, ఈ పాటను తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పాడతారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
మల్టీస్టారర్ సినిమాలంటే... ఇద్దరు, ముగ్గురు హీరోలున్న సినిమాలే కాదు... అలానే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ సిల్వర్‌స్క్రీన్‌పై ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
కథ రీత్యా..తాత –తండ్రి – ఇద్దరు కొడుకులు... ఇలా నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారట. అల్లు అర్జున్ పాత్రలకు తగ్గట్లే... ఈ సినిమాలో నలుగురు ప్రధాన హీరోయిన్స్ రోల్స్ ఉంటాయని, మరో కీలక పాత్రలో ఇంకో హీరోయిన్ కనిపిస్తారని.. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది.
ఈ ఐదుగురు హీరోయిన్స్‌లో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయ్యారు. ఇంకా ఖరారై΄ోయిన వారిలో జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాగూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐదో హీరోయిన్ పాత్ర కోసం భాగ్య శ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా.ఎఫ్‌లపై టెస్ట్ షూట్ జరిగిందని, వీరిలో ఒకరు ఫైనల్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఇలా ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఐదుగురు హీరోయిన్స్ ఒకే సినిమాలో నటించనుండటం, వీరిలో ఇద్దరు పవర్‌ఫుల్ వారియర్ రోల్స్ చేస్తుండటం, అందులోనూ రష్మికా విలన్ పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి రావడం అనేది ఆడియన్స్‌ను కచ్చితంగా ఎగ్జైట్ చేసే విషయమే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహాలో మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి.
– ముసిమి శివాంజనేయులు