శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.
కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.


