
‘సెంటిమెంటల్ వేల్యూ’ చిత్రబృందం
కాన్స్ చిత్రోత్సవాలు ముగిశాయి. ఈ నెల 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఫ్రెంచ్ యాక్టర్ జూలియట్ బినోచే ఈసారి జ్యూరీ ప్రెసిడెంట్‌గా, ముంబై ఫిల్మ్ మేకర్‌పాయల్ కపాడియా జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రతిష్ఠాత్మక ‘పామ్ డి ఓర్’ అవార్డు ఈ ఏడాది ఇరానియన్ ఫిల్మ్ మేకర్ జాఫర్ పనాహీ దర్శకత్వం వహించిన ‘ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్’ సినిమాకు దక్కింది. మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ‘గ్రాండ్ ప్రి’ హాలీవుడ్ చిత్రం ‘సెంటిమెంటల్ వేల్యూ’ని వరించింది. ఈ చిత్రానికి జోచిన్ ట్రియర్ దర్శకత్వం వహించారు.
పోర్చ్‌గీసు చిత్రం ‘ది సీక్రెట్ ఏజెంట్’కి గాను క్లేబర్ మెండోన్కా ఫిల్హోకు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. ఇదే సినిమాలో నటించిన బ్రెజిల్ యాక్టర్ వాగ్నర్ మౌరాకు ఉత్తమ పెర్ఫార్మర్ అవార్డు, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘ది లిటిల్ సిస్టర్’లోని నటనకుగానూ నటి నాడియా మెల్లిటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్ట్రస్‌గా అవార్డు అందుకున్నారు. అమెరికన్ నటుడు– దర్శక–నిర్మాత రాబర్ట్ డి నీరో, మరో అమెరికన్ నటుడు–దర్శక–నిర్మాత డెంజల్ వాషింగ్టన్ గౌరవప్రదమైన (జీవిత సాఫల్య పురస్కారం)పామ్ డి ఓర్ అవార్డులను స్వీకరించారు. అయితే ఈవెంట్ క్లోజింగ్ సమయంలో సదరన్ ఫ్రాన్స్‌లో అనూహ్యంగా పవర్ కట్స్ జరగడంతో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్లోజింగ్ ఈవెంట్‌లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి.
ఒక్క అవార్డు కూడా లేదు: ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్’. హైదరాబాద్ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వాని లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో అవార్డు కోసంపోటీ పడగా, నిరాశ ఎదురైంది. కాగాపాయల్ కపాడియా తీసిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రానికి గత ఏడాది గ్రాండ్ ప్రి అవార్డు దక్కిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఈ ఏడాది భారత దేశానికి ఒక్క అవార్డు కూడా రాలేదు. కాగా ‘అన్ సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ఈ ఏడాది ఫ్రాన్స్ దర్శకుడు డియెగో సస్పెడెస్ తెరకెక్కించిన ‘మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో’ సినిమాకు అవార్డు దక్కింది.