
సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు.
ఆ తరువాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్‌కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.
సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్‌గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్ నటుడు విజయ్‌కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.