
ఇండియన్ సినిమా ప్రపంచ దేశాలను మెప్పించే స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన పాప్ 'సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్' సౌత్ ఇండియా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్‌తో 'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో ఒక ఆల్బమ్‌లో పాట పాడనున్నారు. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ప్రకటించారు.
పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఎడ్వర్డ్ ప్రారంభించాడు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఆయన సాంగ్స్‌కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు సంతోష్ నారాయణన్ సంగీతంలో ఓ ఆల్బమ్‌లో ఎడ్వర్డ్ పాట పాడనున్నారు. ఇదే ఆల్బమ్‌లో తన కుమార్తె 'ధీ' తో పాటు కేరళకు చెందిన ప్రముఖ రాపర్ హనమాన్‌కైండ్ కూడా భాగం కానున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం బెంగళూర్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ‘దేవర’ నుంచి ‘చుట్టమల్లే’ పాటను ఎడ్వర్డ్ ఆలపించారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరలైంది.