ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!

Boycott Trend in Bollywood: Laal Singh Chaddha, Darlings, Dobaaraa, Raksha Bandhan - Sakshi

బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్‌లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్‌ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. 


ఆమిర్‌.. ట్రోలింగ్‌

గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్‌ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్‌లో నెటిజనులు ట్రోల్‌ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్‌ ఖాన్‌ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్‌ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్‌ దంగల్‌, దీపికా పదుకోన్‌ పద్మావత్‌ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. 


అక్షయ్‌కు తప్పని తలనొప్పి

ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్‌ కుమార్‌ 'రక్షా బంధన్‌' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్‌ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్‌లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్‌. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. 


తాప్సి సినిమా చూడొద్దు

అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్‌, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్‌లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని ట్విటర్‌ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్‌ ప్రచారాన్ని అనురాగ్‌, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్‌ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌ వసూలు)


ఒటీటీలనూ వదలడం లేదు 

అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్‌ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్‌ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్‌ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు  నవ్వులాటగా ఉందని ఫైర్‌ అవుతున్నారు. గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మతో కలసి అలియా భట్‌ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్‌ అవర్స్‌ నమోదు చేసి దూసుకుపోతోంది.  (క్లిక్: ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!)


`బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్‌ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్‌కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్‌ కపూర్‌ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్‌ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top