
విచిత్రమైన దుస్తుల వేషధారణతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోనూ మెరిసింది. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ది ట్రైటర్స్ అనే షోలోనూ కనిపించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ షోలో చాలామంది కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. అయితే చివరికీ రియాలిటీ టీవీ షో 'ది ట్రెయిటర్స్' విజేతగా ఉర్ఫీ జావెద్ నిలిచింది.
అయితే ది ట్రైటర్స్ విజేతగా నిలిచిన ఉర్ఫీ జావెద్‌కు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు నెటిజన్స్ చాలా అసభ్యకరంగా సందేశాలు పంపారు. ఈ విషయాన్ని ఉర్ఫీ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. తనపై వస్తున్న కామెంట్స్‌ను స్క్రీన్ షాట్ రూపంలో షేర్ చేసింది. తనకు ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదని అంటోంది.
ఉర్ఫీ జావెద్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఒక అమ్మాయి చేసే పని మీకు నచ్చకపోతే ఆర్ అనే పదాన్ని కామెంట్స్‌లో వదిలేయండి. నన్ను ఇలా బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఈసారి నా దుస్తుల వల్ల కాదు.. నేను ఒక షో గెలిచినందు వల్ల. మీ అభిమానించే ఆటగాడు గెలవకపోతే నన్ను బెదిరించడం లాంటివి ఊహించుకోండి. నేను అప్‌లోడ్ చేసిన వాటిలో ఇవి చాలా డీసెంట్ కామెంట్స్. నేను ఏం చేసినా, ప్రజలు ద్వేషించడం, అసభ్యకరంగా కామెంట్స్ చేయడాన్నే ఇష్టపడుతున్నారు. ఇలాంటి ద్వేషం చూపిస్తూ చేసే మీ కామెంంట్స్ నన్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఆపలేదు.. ఇకపై ఎప్పటికీ ఆపలేవు కూడా' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
కాగా.. అంతకుముందే తాను 'ది ట్రెయిటర్స్' గెలవడం వరకు జరిగిన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా ఈ ప్రయాణం సులభం కాదని.. ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపింది. జీవితంలో చాలా బాధలు ఎదురయ్యాయి.. ఒకానొక సమయంలో అన్ని వదిలేసి పారిపోవాలనుకున్నానని పేర్కొంది. తనకు చాలా బెదిరింపులు, అత్యాచార బెదిరింపులు, నాపై ఎంతోమందికి ద్వేషం ఉన్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయలేదని రాసుకొచ్చింది. 'బిగ్ బాస్‌లో ఓడిపోయినప్పుడు మంచి జీవితాన్ని గడపడానికి నా చివరి అవకాశాన్ని కోల్పోయానని అనిపించిందని తెలిపింది. బిగ్ బాస్‌కు వెళ్లేముందు బట్టలు కొనడానికి స్నేహితుల నుంచి రుణం కూడా తీసుకున్నా.. ఆ సమయంలో నేను తిరిగి చెల్లించగలనో కూడా నాకు తెలియదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది.