
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో మరణించారు. కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. పూర్తి గా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఫిష్ వెంకట్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎంతో మంది ఆర్థికసాయం అందించినప్పటికీ అతని ప్రాణాలు కాపాడలేకపోయారు.
ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సైతం ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు. తన వంతు సాయంగా లక్షన్నర రూపాయలు వారి కుటుంబానికి అందజేశారు. అంతే కాకుండా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలుస్తానని కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఇవాళ హైదరాబాద్కు సోనూ సూద్ వచ్చారు. అనంతరం అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ నివాసానికి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాతో ఫేమస్ అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్‌గా మాత్రమే కాదు విలన్ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్‌లో కనిపించాడు.