Bigg Boss Telugu 5: స‌న్నీకి వాయింపులు, సిరి, ష‌ణ్నుకు వాయినాలు

Bigg Boss 5 Telugu: Bigg Boss House Declares VJ Sunny Guilty - Sakshi

Bigg Boss Telugu 5, Episode 70: స‌న్నీ నోటికొచ్చిన‌ట్లు వాగాడంటూ సిరి.. ష‌ణ్నును ప‌ట్టుకుని ఏడ్చేసింది. ఓ ప‌క్క‌ అత‌డి మీదున్న కోపాన్ని బ‌య‌ట‌కు కక్కుతూనే మ‌రోప‌క్క‌ ష‌ణ్నుకు హ‌గ్గులిస్తూ ఐ ల‌వ్‌యూ చెప్పింది. కాజ‌ల్ పేరు తీస్తేనే బుస‌లు కొడుతున్న‌ యానీ బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్నంత‌వ‌ర‌కు ఆమెతో మాట్లాడ‌న‌ని, ముఖం కూడా చూడ‌న‌ని భీష్మించుకు కూర్చుంది. అటు మాన‌స్ కూడా పింకీ ప్ర‌వ‌ర్త‌న‌లో ఏదో తేడా కొడుతోంద‌ని ఆమెను క‌ట్ చేయాల‌ని చూస్తున్నాడు. కంటెస్టెంట్లు ప‌లుచ‌బ‌డే కొద్దీ కంటెస్టెంట్ల మ‌ధ్య వైరాలు పెరుగుతున్నాయి.

తర్వాత ఓ టాస్క్‌లో ప్రియాంక గెలిచి రామ్‌చ‌ర‌ణ్ ఆటోగ్రాఫ్ అందుకుని మురిసిపోయింది. సీక్రెట్ రూమ్‌లో ఉన్న జెస్సీ త‌న‌ శ‌రీరం లావైతున్న‌ట్లుగా, ఎవ‌రో బాడీని ప‌ట్టుకున్న‌ట్లుగా ఉంద‌ని, చూపు షేక్ అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు. అత‌డిని ప‌రీక్షించిన వైద్యులు జెస్సీకి మ‌రింత మెరుగైన చికిత్స అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భీమ్లా నాయ‌క్ పాట‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇంటిస‌భ్యుల‌తో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొద‌ట‌గా యానీ.. కాజ‌ల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. నాగ్ ముందే నాగిణి డ్యాన్స్ చేస్తూ ఆమెను వెక్కిరించింది. అయిన‌ప్ప‌టికీ మెజారిటీ కంటెస్టెంట్లు యానీకే స‌పోర్ట్ చేశారు.

త‌ర్వాత ర‌వి.. వెరీ బ్యాడ్ బిహేవియ‌ర్‌, లూజ్ టంగ్ అంటూ స‌న్నీపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాడు. తంతా, అప్ప‌డం చేసి అమ్మేస్తా అన్నాడని ర‌వి చెప్ప‌డంతో తాను అన‌లేద‌ని బుకాయించాడు స‌న్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేశాడు. స‌న్నీ మొద‌ట తంతాన‌న్నాడ‌ని, కానీ ఎవరిని అన‌డంతో ట‌వ‌ర్‌ను తంతాన‌ని క‌వ‌ర్ చేశాడ‌ని నాగ్ చెప్పడంతో అత‌డి ప‌రువు పోయిన‌ట్లైంది. అయితే స‌న్నీ మాత్రం తాను బ్రిక్స్‌నే తంతాన‌న్నాన‌ని మ‌రీమ‌రీ చెప్పాడు. అమ్ముతాన‌ని సిరిని అన్నావంటూ మ‌రో వీడియో చూపించాడు నాగ్‌. స‌న్నీ త‌ర‌పున వాదించిన కాజ‌ల్ అత‌డు సిరిని అమ్ముతాన‌ని అన‌లేద‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పింది.

త‌ర్వాత‌ స‌న్నీ.. సిరిని బోనులో నిల‌బెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మాన‌స్‌, కాజ‌ల్ త‌ప్ప‌ అంద‌రూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మాన‌స్‌.. యానీ మాస్ట‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ప్ప‌టికీ అది వీగిపోయింది. శ్రీరామ‌చంద్ర‌.. ప్రియాంక‌ను బోనులో పెట్టాడు. ఎన్ని పాట‌లు పాడినా 100 రూపాయ‌ల కంటే ఎక్కువ ఇవ్వ‌లేద‌ని ఆరోపించాడు. శ్రీరామ్ ముందుగానే ఫ్లాట్ అయిపోయి పాట పాడితే నాది త‌ప్పా? అని రాగాలు తీసింది. హౌస్‌మేట్స్ స‌గం మంది త‌న‌ను గిల్టీ, మిగ‌తావాళ్లు గిల్టీ కాద‌ని చెప్పారు.


మాన‌స్ గ‌ట్టిగా అర‌వ‌డం న‌చ్చ‌లేద‌ని అత‌డిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్‌మేట్స్ మాన‌స్‌ను నిర్దోషిగా తేల్చారు. త‌ర్వాత కాజ‌ల్‌.. యానీ త‌న‌ను వెక్కిరిస్తుందంటూ బోనులో నిల‌బెట్టింది. అయితే ఆమె వెక్కిరించ‌లేద‌ని, అది త‌న బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. మెజారిటీ కంటెస్టెంట్లు సిరి వాద‌న‌తో ఏకీభ‌వించ‌డం విశేషం. త‌ర్వాత ష‌ణ్ను.. నేను ఆడ‌వాళ్ల‌ను అడ్డం పెట్టుకుని ఆడ‌తాన‌న‌డం, న‌న్ను యూట్యూబ్ వ‌ర‌కే అని చెప్ప‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని బోనులో నిల‌బెట్టాడు.

దీనికి సంబంధించిన‌ వీడియో కూడా ప్లే చేసి చూపించ‌గా ర‌వి, శ్రీరామ్‌, సిరి, యానీ.. అత‌డు ష‌ణ్నును యూట్యూబ్ వ‌ర‌కే అన్నాడ‌ని చెప్ప‌గా మిగిలిన ముగ్గురు ష‌ణ్నును అన‌లేద‌ని, కామెంట్లు యూట్యూబ్ వ‌ర‌కే అని చెప్పాడ‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ మెజారిటీ కంటెస్టెంట్లు ష‌ణ్నును స‌మ‌ర్థించారు. అంద‌రూ మ‌ధ్య‌లో రావ‌డం వ‌ల్లే గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ని కాజ‌ల్ ఉన్న‌మాట చెప్పింది. సిరి స‌న్నీ గొడ‌వ ప‌డుతుంటే ష‌ణ్ను మ‌ధ్య‌లోకి రావ‌డం వ‌ల్లే గొడ‌వ పెద్ద‌దైంద‌ని తెలిపింది. అయితే నాగ్ మాత్రం కాజ‌ల్‌.. యానీకి గిలిగింత‌లు పెట్ట‌డం వ‌ల్లే అస‌లు గొడ‌వ మొద‌లైంద‌న్నాడు నాగ్‌. మొత్తంగా స‌న్నీ మెడ‌లో గిల్టీ బోర్డు వేలాడ‌దీశారు. త‌ర్వాత స‌న్నీ సేవ్ అయిన‌ట్లు వెల్ల‌డించాడు నాగ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top