Big Boss Updates: Abijeet Fans Troll RJ Kajal on Social Media- Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: కాజల్‌ను ట్రోల్‌ చేస్తున్న 'అభి' ఫ్యాన్స్‌!

Sep 7 2021 7:31 PM | Updated on Sep 8 2021 9:07 AM

Bigg Boss 5 Telugu: Abhijeet Fans Trolling RJ Kajal - Sakshi

అతి సర్వత్రా వర్జయేత్‌ అంటారు. అంటే ఏ విషయంలోనైనా అతిగా ఉండకూడదు అని! కానీ అతి ఎగ్జయిట్‌మెంట్‌తో ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది ఆర్జే కాజల్‌. తనకు బిగ్‌బాస్‌ షో అంటే ఎంతో ఇష్టమని, అలాంటిది ఆ షోలో తను భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తొలి రోజే ఉబ్బితబ్బిబ్బైపోయింది కాజల్‌. హౌస్‌ అంతా కలియతిరుగుతూ అందరితోనూ మాట కలుపుతూ హడావుడి చేస్తోంది. అయితే ఆమె ఉత్సుకత మిగతావారికి మింగుడు పడటం లేదు. ఇదంతా ఏదో కావాలని చేస్తున్నట్లు ఉందని కొందరు కంటెస్టెంట్లు అభిప్రాయపడుతున్నారు.

దీంతో హౌస్‌లో ఆమె ఏం చేసినా ఒకరకంగా దాన్ని ఓవరాక్షన్‌ అనే వర్ణిస్తున్నారు. వాళ్లే కాదు సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు ఇదే అభిప్రాయపడుతున్నారు. నామినేషన్‌ ప్రక్రియలో 'బిగ్‌బాస్‌ తన కలల హౌస్‌' అంటూ డ్రీమ్‌ కార్డ్‌ వాడిన ఆమె, నేటి ప్రోమోలో కన్నీళ్లు పెట్టుకుని చైల్డ్‌ కార్డ్‌ వాడుతోందంటూ సెటైర్లు వేస్తున్నారు. గత సీజన్‌లో అభిజిత్‌ పీఆర్‌ టీమ్‌ పెట్టుకున్నాడంటూ నెగెటివిటీ వ్యాప్తి చేసిన ఆమెను అభి ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

పైగా తొలి రోజే కాజల్‌ అందరి దగ్గరకు వెళ్లి వారి పర్సనల్‌ విషయాల కూపీ లాగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె హౌస్‌లో ఓ వైరస్‌ లాంటిదని, వీలైనంత తొందరగా తనను బయటకు పంపించేయండని అభి ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు. కాజల్‌ అభిమానులు మాత్రం ఈ ట్రోలింగ్‌ను గట్టిగా తిప్పికొడుతున్నారు. ఆమె మీద ఇంత విషం చిమ్మడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. తన ఎగ్జయిట్‌మెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆమె ఆటతీరు చూశాక మాట్లాడితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. మరి ఈ నెగెటివిటీ నుంచి కాజల్‌ ఎలా బయటపడుతుంది? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement