అవినాష్ తిక్క కుదిర్చిన అరియానా

Bigg Boss 4 Telugu: Ariyana Glory Complaint On Avinash In BB Hotel Task - Sakshi

నామినేష‌న్‌లో వీర లెవ‌ల్లో ప్ర‌తాపాలు చూపించిన ఇంటి స‌భ్యులు ఆవేశం చ‌ల్లార‌గానే ఆలోచ‌న‌లో ప‌డ్డారు. బాధ‌పెట్టామ‌ని భావించిన వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఎమోష‌న‌ల్ ఫైట్‌తో హీటెక్కిన హౌస్‌ను బిగ్‌బాస్ బీబీ టాస్క్ ద్వారా కూల్ చేశాడు. రెచ్చిపోయి ప‌ర్‌ఫామ్ చేసిన ఇంటి స‌భ్యులు పంచ్‌లు కూడా విసురుకున్నారు. అయితే హోట‌ల్ స్టాఫ్‌లోనే ఒక‌రు వారి సేవ‌ల‌ను చెడ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటే మ‌రొక‌రు అతిథుల ద‌గ్గ‌ర నుంచే స్టార్ల‌ను దొంగిలించ‌డం విశేషం. మ‌రి నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

నోయ‌ల్‌కు మాస్ట‌ర్ శాప‌నార్థాలు
నామినేష‌న్‌లో దివి చెప్పిన ప‌ప్పు కార‌ణానికి లాస్య వెక్కి వెక్కి ఏడుస్తుంటే గంగ‌వ్వ ఆమెను త‌ల్లిలా ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఊరుకోబెట్టింది. త‌ర్వాత మోనాల్ ఏడుస్తుంటే లాస్య బుజ్జిగించింది. అది చూసిన అభి.. ఇదంతా నా వ‌ల్లే జ‌రిగింది అంటూ క్ష‌మాప‌ణ‌లు కోరాడు. అయినా ఆమె అల‌క‌తో బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. త‌ర్వాత అఖిల్‌తో కూర్చుంది. నీ కోసం పోట్లాడితే నామినేష‌న్‌లో న‌న్ను త‌ప్పుగా చూపించావు అని అఖిల్ అలిగి మాట్లాడ‌టం మానేశాడు. అనంత‌రం నోయ‌ల్ త‌ను నామినేట్ చేసిన‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అత‌ను వినిపించుకోలేదు. ఈ క‌బుర్ల‌న్నీ చిన్న‌పిల్ల‌ల‌కు చెప్పుకోపో అని క‌సురుకున్నాడు. "న‌న్ను పంపించేయాల‌ని ప్లాన్ చేశావ్‌, అదే జ‌ర‌గాలి, నువ్వు జీవితాంతం బాధ‌ప‌డాలి" అని శాప‌నార్థం పెట్టాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్ గుట్టు విప్ప‌నున్న నాగ్‌)

అవినాష్‌కు సీక్రెట్ టాస్క్‌
అనంత‌రం బిగ్‌బాస్‌ అవినాష్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోట‌ల్‌లో స్టాఫ్ ఛాలెంజ్‌ల‌ను, అతిథుల‌కు అందించే స‌ర్వీసుల‌ను పాడు చేయాలని ఆదేశించాడు. హోట‌ల్ స్టాఫ్‌కు త‌క్కువ స్టార్లు వ‌చ్చేలా చూడాల‌ని చెప్పాడు. ఇక‌ హోట‌ల్ మేనేజ‌ర్ అఖిల్‌, స్టాఫ్‌ అభిజిత్‌, సెక్యూరిటీ అండ్‌ చెఫ్‌ సుజాత‌, లాస్య‌, అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిట‌ర్‌‌‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌, హౌస్ కీపింగ్ నోయ‌ల్‌, కుమార్, స‌ర్వీస్ అండ్ స్పా దివి, మోనాల్‌, అసిస్టెంట్ మేనేజర్‌గా అవినాష్ వ్య‌వ‌హ‌రించారు. రిచ్‌మెన్లుగా మెహ‌బూబ్‌, సోహైల్‌, హారిక‌, రాకుమారిగా అరియానా, ఆమె త‌ల్లిగా గంగ‌వ్వ పాత్ర‌ల్లో లీన‌మయ్యారు. (చ‌ద‌వండి: అఖిల్ పాపం, మోనాల్ ఆడుకుంటోంది)

చెంచాతో బ‌కెట్ నింపు: అరియానా
ఆట మొద‌ల‌వ‌గానే అతిథులు దొరికిందే ఛాన్స్ అన్న‌ట్టుగా హోట‌ల్ సిబ్బందితో సేవ‌లు చేయించుకున్నారు. మెహ‌బూబ్ త‌న‌కు చికెన్ ప‌కోడి కావాలంటే ‌గంట, గంట‌న్నర‌ ప‌డుతుంద‌ని అభిజిత్ చెప్పాడు. నేను అర‌గంట‌లో చేస్తాన‌ని మెహ‌బూబ్ అన‌డంతో వెళ్లి, చేసుకోండి అని అభిజిత్ పంచ్ వేశాడు. త‌ర్వాత రాకుమారి అరియానా అవినాష్ త‌న చేయి పట్టుకున్నాడ‌ని మ‌హారాణి గంగ‌వ్వ‌తో చెప్ప‌డంతో కాలు మొక్కు అని అత‌డికి ఆర్డ‌ర్ వేసింది. ముద్దు పెట్టుకుందామ‌ని కూడా ప్ర‌య‌త్నించారంటూ అరియానా గగ్గోలు పెట్టింది. అవినాష్ చేసిన ప‌నికి చెంచాతో బకెట్ నింప‌మ‌ని శిక్ష విధించింది. అలా స్టార్స్ ఇవ్వ‌డానికి మూడు చెరువుల నీళ్లు తాగించారు. (చ‌ద‌వండి: నా క్యారెక్టర్‌తో ఆటలొద్దు : మోనాల్‌)

ఐదు స్టార్ల‌ను లేపేసిన అభిజిత్‌
వీరి ప్ర‌వ‌ర్త‌న‌తో విసుగెత్తిపోయిన అవినాష్ రాకుమారిని చిల్ల‌ర‌గా ప్ర‌వ‌ర్తించ‌కండ‌ని విసుక్కున్నాడు. మ‌ధ్య‌లో సోహైల్ క‌ల‌గ‌జేసుకుని మాట్లాడ‌బోతే దీనితో మీకు సంబంధం లేదంటూ వేలు చూపించాడు. దీంతో మేనేజ‌ర్ అఖిల్ రంగంలోకి దిగి అవినాష్‌ను కొట్టిన‌ట్లు చేసి ప‌క్క‌కు తీసుకెళ్లాడు. రాత్రి కావ‌స్తున్నా ఒక్క‌రు కూడా స్టార్ ఇవ్వ‌క‌పోవ‌డంతో చిర్రెత్తిపోయిన మాస్ట‌ర్ సోహైల్‌ను నువ్వెప్పుడైనా ఫైవ్ స్టార్ హోట‌ల్ వెళ్లావా? లేదా? అని సీరియ‌స్ అయ్యాడు. అన్నీ చేయించుకుని క‌నీసం టిప్పు కూడా ఇవ్వ‌ట్లేద‌ని ముఖం మాడ్చుకున్నాడు. కానీ అభిజిత్ అంద‌రిలా అప‌సోపాలు ప‌డ‌లేదు. ఇక్క‌డ కూడా అభిజిత్ మైండ్ గేమ్ ఆడాడు. అతిథుల‌ను మెప్పించి సంపాదించాల్సిన 5 స్టార్ల‌ను వాళ్లకు తెలియ‌కుండానే కొట్టేశాడు. అటు అవినాష్ కూడా ఎవ‌రికీ ఏ అనుమానం రాకుండానే హోట‌ల్ స్టాఫ్‌ల‌కు ఏ టిప్పూ, స్టార్ రాకుండా ఆట‌ను చెడ‌గొడుతున్నాడు. రేపు ఈ గేమ్ మ‌రింత సీరియ‌స్ కానున్న‌ట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top