
బిగ్‌బాస్ హిందీ 14వ సీజన్‌లో పాల్గొన్న టీవీ నటుడు షార్దుల్ పండిత్ గత వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో అతడికి ఏమేం ఆఫర్లు వచ్చాయని అడగ్గా విస్తుపోయే విషయాలు చెప్పాడు. తన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని వాపోయాడు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆఫర్లు లేవని, చేయడానికి ఏ పనీ లేదని విచారం వ్యక్తం చేశాడు. "ఇప్పుడు నా చేతిలో ఎలాంటి పని లేదు. నేనే కాదు, షో నుంచి వచ్చేసిన వాళ్లలో గీతా కపూర్ సహా మరికొందరు ఇలాంటి పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అయితే నాకు డబ్బు అవసరమంటూ ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ నాకు పని కావాలి. ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షో నుంచి నేను బయటకు వచ్చేశాను. ఇప్పుడు ఖాళీ చేతులతో ఉన్నాను. ఇదంత మంచి విషయమేమి కాదు. కానీ ఇదే నిజం. నాకు నిజంగా పని కావాలి' అని ఆర్తిగా ప్రార్థించాడు. ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షార్దుల్ తన కెరీర్ మళ్లీ మొదటికి వచ్చిందని చెప్పుకొచ్చాడు. (చదవండి: 7 కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు ఇదే?)
కాగా రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన షార్దుల్ బాందిని సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యాడు. కిత్నే మొహబ్బత్ హై 2, కుల్దీపాల్ అండ్ సిద్ధి వినాయక్ వంటి షోలలోనూ కనిపించాడు. బాక్స్ క్రికెట్ లీగ్(బీసీఎల్)కు వ్యాఖ్యాతగానూ వ్యహరించాడు. ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా కెరీర్ ముందుకు సాగిపోతుందనుకున్న క్రమంలో అతడిని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తప్పని స్థితిలో ఇండస్ట్రీ నుంచి రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. కోలుకున్న తర్వాత తిరిగి రీఎంట్రీ ఇద్దామనుకునేలోపు అతడి నెత్తిన లాక్‌డౌన్ పిడుగు పడింది. ఎలాంటి ఉపాధి లేకపోవడంతో ఆయన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడంతో డిప్రెషన్‌కు లోనయ్యాడు. ఒకానొక సమయంలో ఆత్మహత్య ఆలోచనలు సైతం అతన్ని వెంటాడాయి. ఏం చేయాలో తోచని స్థితిలో తనకు పని ఇప్పించండి అని సోషల్ మీడియాలో వేడుకున్నాడు. తీరా అతడికి వెబ్ సిరీస్‌లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ బిగ్‌బాస్ కోసం ఉన్న ఒక్కగానొక్క అవకాశాన్ని చేజేతులా వదులుకున్నాడు. మళ్లీ తనకు పని ఇప్పించమని అభ్యర్థిస్తున్నాడు. (చదవండి: వైరల్: ‘సామ్ జామ్’లో మెరిసిన మెగాస్టార్..)