
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) వ్యాఖ్యలు సినీకార్మికుల పొట్టకొట్టేలా ఉన్నాయని సినిమా ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్వప్రసాద్‌కు సినిమా ఇండస్ట్రీపై అవగాహన లేదని, ఆయన ఫిలిం ఫెడరేషన్ నాయకులపై వేసిన కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆయన మాటలు దారుణం
శనివారం నాడు సాక్షి టీవీతో టైగర్ రాజు మాట్లాడుతూ.. చిరంజీవిని కలిసి మా సమస్యలను విన్నవించాము. రేపటి వరకు నిర్మాతలు ఏమీ తేల్చకపోతే సోమవారం నుంచి ఆయన షూటింగ్‌కు ఫెడరేషన్ కార్మికులకు 30 శాతం జీతాలు పెంచి షూటింగ్ జరుపుతానని చెప్పారు. మా సమస్యకు పరిష్కారం దొరుకుతున్న సమయంలో విశ్వప్రసాద్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నిర్మాత సి.కల్యాణ్ కూడా కార్మికుల నుంచి వచ్చినవాడే.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నారు.
విశ్వ ప్రసాద్ ఏమన్నారు?
సినీ కార్మికుల వేతనాల పెంపుపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. 30% వేతనం పెంచేవరకు షూటింగ్స్‌లో పాల్గొనమని కార్మికులు బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మలయాళంలో రూ.1 కోటి బడ్జెట్‌తో తీసే సినిమా తెలుగులో తీయాలంటే రూ.15 కోట్లు అవుతోంది. మలయాళంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అదే ఇక్కడ నటీనటుల భారీ రెమ్యునరేషన్లు, టెక్నికల్ టీమ్‌లో భారీ జీతాలు, షూటింగ్స్‌లో పనిచేసే కార్మికుల వేతనాలు ఎక్కువ ఉండటంతో బడ్జెట్ అధికమవుతోంది.
వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడిస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోంది. స్కిల్ లేనివారికి ఇంకా జీతాలు పెంచివ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మరుతోంది. ఇండస్ట్రీలో కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంటసేపే పనిచేస్తారు. అయినా వారికి మిగతావాళ్లతో సమానంగా వేతనాలిస్తున్నాం అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
చదవండి: మహేశ్ బాబు సినిమా.. కీలక అప్డేట్ ఇచ్చిన రాజమౌళి