బాలీవుడ్ నటి అనుష్కా శర్మ(Anushka Sharma) సుమారు ఏడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన కొత్త సినిమా ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2022లోనే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదల కాలేదు. భారత దిగ్గజ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క లీడ్ రోల్ చేసింది. దర్శకులు ప్రొసిత్ రాయ్ ఈ సినిమాను తెరకెక్కించారు.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా భారత జట్టు నిలిచింది. ఈ విజయం యావత్ మహిళల క్రికెట్‌ను మార్చబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ విడుదలైతే సినిమాకు మంచి మైలేజ్ వస్తుందని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల విడుదల విషయంలో ఆగిపోయిన ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. 2018లో జీరో సినిమాలో షారుఖ్ ఖాన్‌తో చివరిగా అనుష్క శర్మ నటించారు. తర్వాత ఆమె కొత్త సినిమాలకు ఒప్పుకోలేదు. దీంతో చక్‌దే ఎక్స్‌ప్రెస్ విడుదలైతే మంచి కెలక్షన్స్ రావచ్చు.

క్లీన్‌స్లేట్ ఫిల్మ్జ్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ని నిర్మించాయి. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే బుల్‌బుల్, కాలా, కోహ్రా వంటి సందేశాత్మక సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు బ్యానర్లు పలు కారణాల వల్ల తమ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి. ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ సినిమా బడ్జెట్ విషయంలోనే వారికి మనస్పర్థల వచ్చాయని టాక్. దీంతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదల కాలేదు. అయితే, తాజా సమాచారం మేరకు క్లీన్‌స్లేట్ ఫిల్మ్జ్ ఇప్పుడు ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ను విడుదల చేయాలని చూస్తుందట. అందుకోసం నెట్‌ఫ్లిక్స్ ఇండియా సంస్థతో చర్చలు కూడా జరిపిందని సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చిని తెలుస్తోంది.


