
‘‘నేను రాసిన పుస్తకాలు నా జీవిత అనుభవాల నుంచి వచ్చాయి. అవి నాకు నేర్పిన పాఠాలనే నా పుస్తకాల్లో పొందుపరిచాను’’ అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ఆయన విలక్షణమైన నటుడే కాదు.. మంచి రచయిత కూడా అనే సంగతి తెలిసిందే. ఆయన రాసిన పుస్తకాల్లో ఇప్పటికే మూడు బుక్స్‌ని రిలీజ్ చేశారాయన. తాజాగా ‘డిఫరెంట్ బట్ నో లెస్’ అనే నాలుగో పుస్తకాన్ని ఆవిష్కరించారు అనుపమ్ ఖేర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘నా నిజ జీవిత ఘటనలతో రాసిన ఈ పుస్తకం నాకు చాలా ప్రత్యేకం. ఇందులో నేను దర్శకత్వం వహించిన ‘తన్వి ది గ్రేట్’ సినిమా కథ, షూటింగ్‌లో ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న విధానాన్ని ప్రస్తావించాను. నేను బాక్సాఫీస్ వసూళ్ల గురించి పెద్దగా పట్టించుకోను. మా సినిమా ఎప్పటికైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. కరణ్ టాకర్, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి నటించిన ‘తన్వి ది గ్రేట్’ ఈ నెల 18న విడుదలైన సంగతి తెలిసిందే.