
లేడీ యాంకర్స్ పేరు చెప్పగానే చాలామందికి అనసూయ, రష్మీ గుర్తొస్తారు. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ల క్రితం మొదలైన ఓ తెలుగు కామెడీ షోతోనే వీళ్లిద్దరూ యాంకర్స్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత కాలంలో చాలా పేరు సొంతం చేసుకున్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ వాటికి ఆధారం లేకపోవడంతో ఎవరూ వాటిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు స్వయంగా అనసూయనే తనకు రష్మీ మాట్లాడి చాన్నాళ్లయిందనే విషయాన్ని బయటపెట్టింది.
రష్మీ-అనసూయ చాన్నాళ్లుగా మాట్లాడుకోవట్లేదు. ఇదేదో మేం చెబుతున్న విషయం కాదు, స్వయంగా అనసూయనే చెప్పుకొచ్చింది. ప్రముఖ కామెడీ షో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. దీనికి పాత టీమ్ లీడర్స్, జడ్జిలు అందరూ వచ్చారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన అనసూయ.. రష్మీతో ప్యాచ్ అప్ చేసుకుంది. అసలేం జరిగిందో చెప్పింది.
(ఇదీ చదవండి: ఎందుకయ్యా మంచి భోజనం పెట్టి ఏడిపిస్తున్నారు: రాజీవ్ కనకాల)

'జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదని అంటారు కానీ తప్పకుండా ఇస్తుందని నేను అంటాను. కొన్ని ప్యాచ్ అప్స్ చేయాల్సి ఉంది' అని యాంకర్ రష్మీని వెళ్లి అనసూయ హగ్ చేసింది. దీంతో రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది. 'ఎవరికీ తెలియనివి కొన్ని తెలిసిపోయేలా ఉన్నాయ్ ఈ ప్యాచ్ అప్ వల్ల, ఓహ్ వీళ్లిద్దరూ మాట్లాడుకోవట్లేదా?' అని అనసూయ అనగానే.. 'ఇదేదో వాట్సాప్‌లో లేదా ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేదిగా' అని రష్మీ చెప్పింది. 'అలా అయితే చాలా ఈగోలు అడ్డొస్తాయి. ఇలా అయితే..' అంటూ అనసూయ నవ్వేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు.
రష్మి ఇప్పటికీ యాంకర్‌గానే పలు షోలు చేస్తుండగా.. అనసూయ మాత్రం పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. కొన్నిరోజుల క్రితం ఒకటి రెండు షోల్లో కనిపించింది. కాకపోతే గతంలోలా ఎప్పుడు పడితే అప్పుడు బుల్లితెరపై కనిపించట్లేదు. ఇప్పుడు ఇలా సడన్‌గా షోలో ప్రత్యక్షమై రష్మీతో తనకు మనస్పర్థలు, చాన్నాళ్లుగా మాట్లాడుకోవట్లేదు అనే విషయం చెప్పేసరికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
(ఇదీ చదవండి: ఇల్లు కట్టిస్తానని సోనూసూద్ మాటిచ్చారు: షిఫ్ వెంకట్ కూతురు)