
ఈ వీకెండ్ రాఖీ పండగ. దీంతో అక్కచెల్లెమ్మలు.. రాఖీలు కొనేస్తున్నారు. మరోవైపు తెలుగులోని పలు ఛానెల్స్ వాళ్లు స్పెషల్ ప్రోగ్రామ్స్ రెడీ చేశారు. ఈ క్రమంలోనే ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు. ఒకదానికి నటుడు రాజీవ్ కనకాల వచ్చాడు. అయితే షో మొత్తం ఎంజాయ్ చేశాడు. చివరలో ఐదేళ్ల క్రితం చనిపోయిన తన చెల్లిని చూపించేసరికి గుక్కపెట్టి ఏడ్చాడు. ఆమెని గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాడు.
ఆదివారం ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్‌కి రాజీవ్ కనకాల అతిథిగా వచ్చాడు. ఈ షోలోనే రాఖీ నేపథ్యంగా నూకరాజు, వర్ష అన్నాచెల్లిగా నటిస్తూ ఓ స్కిట్ చేశారు. చివర్లో చెల్లి పాత్రధారి వర్ష క్యాన్సర్‌తో చనిపోయినట్లు చూపించారు. ఈ స్కిట్ అక్కడున్న అందరిని కంటతడి పెట్టించింది. రాజీవ్ కూడా ఎమోషనల్ అయ్యారు. 'ఎందుకయ్యా మంచి భోజనం పెట్టి తర్వాత ఇలా ఏడిపిస్తున్నారు' అని కన్నీటి పర్యంతం అయ్యారు.
(ఇదీ చదవండి: ఇల్లు కట్టిస్తానని సోనూసూద్ మాటిచ్చారు: షిఫ్ వెంకట్ కూతురు)
ఇదే షోలో ఇప్పటికే చనిపోయిన రాజీవ్ చెల్లి శ్రీలక్ష‍్మిని ఏఐ వీడియో రూపంలో చూపించారు. ఆమె వచ్చి రాజీవ్‌కి రాఖీ కట్టినట్లు, శుభాకాంక్షలు చెప్పినట్లు చూపించారు. ఇదంతా చూసిన రాజీవ్ మరింత వెక్కి వెక్కి ఏడ్చారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
రాజీవ్ కనకాల చెల్లి శ్రీలక్ష‍్మి.. 2020లో రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 40 ఏళ్లే. ఈమె కొన్ని సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించారు. దూరదర్శన్ ఛానెల్‌లో వచ్చిన 'రాజశేఖర్ చరిత్రం' సీరియల్‌తో నటిగా పరిచయమయ్యారు. తర్వాత తండ్రి దేవదాస్ కనకాల తీసిన పలు ధారావాహికల్లో కనిపించారు. అలానే తెలుగు, కన్నడ, హిందీల్లో సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. అయితే చెల్లి శ్రీలక్ష‍్మి చనిపోవడానికి ఏడాది ముందే తండ్రి దేవదాస్ కనకాల చనిపోగా.. 2018లో తల్లి లక్ష‍్మిదేవి కన్నుమూశారు.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. 34 ఏళ్లకే చనిపోయిన హీరో)