ANR Birthday Special: మహానటుడు, రికార్డుల రారాజు

Akkineni Nageswara Rao Birthday Special - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన గొప్ప నటుడు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు. యావత్‌ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ  ఏఎన్‌ఆర్‌. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్‌. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి.

ఏఎన్ఆర్‌ అంటే తరతరాలకు తరగని గని. ఆయన సినిమాలు, పాత్రలు గొప్ప పాఠాల్లాంటివి.  తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా చాటిన ఘనత ఆయనది. పెద్దగా చదువుకోకపోయినా నాటకాల్లో స్త్రీ పాత్రల్లో రాణించారు. స్వయంగా పద్యాలు పాడుతూ ఆకట్టుకున్నారు. ఆ తరువాత సినీరంగంలో ఎన్నో పౌరాణిక,  సాంఘిక, జానపద చిత్రాల్లో తనదైన హావభావాలు, నటనతో  నట సామ్రాట్‌గా చరిత్రలో నిలిచిపోయారు.  అందుకే ప్రతిష్టాత్మక  పద్మశ్రీ, పద్మ విభూషణ్‌,   కళా ప్రపూర్ణ , దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు సహా  అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను  దక్కించుకున్నారు. 

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1923, సెపెంబర్‌ 20న పుట్టిన ఆయన చిన్నతనం నుంచే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి, అనేక కష్టసుఖాలకోర్చి, పట్టుదలతో రాణించి పుట్టిన గడ్డ గర్వపడేలా ఎదిగారు. అంతేనా.. అన్నపూర్ణ స్టూడియోస్  ద్వారా అనేక విజయవంతమైన సినిమాలను అందించారు. (ANR: ఫేవరెట్‌ వాచ్‌, ఖద్దరు ఇదే! నాగ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌)

తొలినాళ్ళలో నాటక రంగానికి ఆకర్షితుడై బాల్యంలోనే స్త్రీ పాత్రలతో అలరించిన అక్కినేని నాగేశ్వరరావు, 1941లో ధర్మపత్ని చిత్రంలో చిన్న పాత్ర ద్వారా ప్రశంసలందుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ చిత్ర పరిశ్రమను శాసించే  స్థాయికి ఎదిగారంటేనే ఆయన నట ప్రస్థానాన్ని  ఊహించుకోవచ్చు. ఎన్నో చిత్రాలు, మరెన్నో పాత్రలు, ప్రతిపాత్రా ఒక ఛాలెంజ్‌. ప్రతీ సినిమా ఒక ల్యాండ్‌ మార్క్‌. 

కీలు గుర్రం సినిమాలో బాలరాజుగా అద్భుత నటనతో  తొలి జానపద హీరోగా శభాష్‌ అనిపించుకున్నారు. ఇలా జానపదం, సాంఘికం పౌరాణికం పాత్ర ఏదైనా దానికి జీవంపోశారు. అక్కినేని సినీ ప్రస్థానంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఎన్నో.  ప్రేమికుడిగా మురిపించినా, భగ్న ప్రేమికుడుగా ఏడిపించినా, ఇద్దరు భార్యల ముద్దుల భర్తగా, వీరభక్తుడిగా అలరించినా, సైనికుడిగా ధీరత్వం చూపించినా అది ఆయనకు మాత్రమే సొంతం. తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూత లూగించడమే కాదు. తన ఊపిరి ఉన్నంత వరకు కళామతల్లికి సేవచేస్తూనే ఉంటానన్న మాటకు కట్టుబడి అనారోగ్యంతో బాధపడుతున్నా 'మనం' ద్వారా తన మాటను నిలబెట్టుకున్నారు.  అలాగే హీరో అక్కినేని నాగార్జునతో పాటు, యంగ్‌ హీరోలు నాగ చైతన్య, అఖిల్‌, సుమంత్‌ తదితరులను తన నట వారసులుగా అందించారు. 

రాసికన్నా వాసి మిన్న అని నమ్మిన  ఏఎన్‌ఆర్‌ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం ఉండేటట్లుగా  జాగ్రత్తలు తీసుకునే వారని సినిమా పెద్దలు చెబుతుంటారు. కుటుంబ సంబంధాలు, ఆత్మీయతా, అనురాగాలు, మానవ విలువలకు తన చిత్రాల్లో పెద్ద పీట వేసేలా జాగ్రత్త పడ్డారు. 1990వ దశకంలో బంగారు కుటుంబం నుంచి చిట్టచివరి సినిమా మనంలోనూ అదే చాటి చెప్పారు. సంసారం, బ్రతుకు తెరువు, ఆరాధన, దొంగ రాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్థాంగి, మాంగల్యబలం, ఇల్లరికం, శాంతి నివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, ధర్మదాత, బాటసారి, కాలేజి బుల్లోడు, అనుబంధం, శ్రీవారి ముచ్చట్లు లాంటి చిత్రాలతో పాటు అమరశిల్పి జక్కన, విప్రనారాయణ, భక్త తుకారాం లాంటి ఆణిముత్యాలను అందించారు.  ఈ క్రమంలో 1991లో స్వర్ణోత్సవం సందర్భాన విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు బాక్సాఫీసు హిట్ గా నిలిచింది. 

డాక్టర్‌ చక్రవర్తి ద్వారా తొలి నందిని అందుకున్నారు నాగేశ్వరరావు. దీంతోపాటు అంతస్తులు, స్వీయ నిర్మాణంలో వచ్చిన సుడిగుండాలు చిత్రాలకు కూడా నంది అవార్డులు దక్కాయి. మహాకవి కాళిదాసుగా అద్భుత నటనకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కాళిదాస సమ్మాన్‌ బిరుదు వరించింది. అలాగే మేఘసందేశానికి 18 అవార్డుల తోపాటు, మరో బంగారు నందిని దక్కించుకోవడం విశేషం. మలిదశలో సీతారామయ్యగారి మనువరాలు సినిమాతో ఫిలింఫేర్‌ సొంతం చేసుకుని హ్యాట్సాఫ్‌ అనిపించుకున్నారు.

అవార్డుల రారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరావు 1968లో పద్మశ్రీ అందుకున్న తొలిహీరో. అంతేకాదు 1988లో  గౌరవ పద్మభూషణ్‌ అందుకున్న తొలి తెలుగు హీరో అక్కినేని. 1990లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడు. 1996లో ఎన్టీఆర్‌ అవార్డు, 2011లో పద్మ విభూషణ్‌ పురస్కారం  లభించింది.

రోజులు మారాయి,  అనార్కలి, దసరాబుల్లోడు, దేవదాసు, ప్రేమాభిషేకం ఇలా ఎన్నో సినిమాలు  ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ప్రజలు బళ్లు కట్టుకొని మరీ వచ్చి ఆయన సినిమాలను  చూసేవారట. ప్రధానంగా పూర్తి రంగుల హంగులతో వచ్చిన దసరా బుల్లోడు, ప్రేమ్‌నగర్‌ సినిమాలు పెద్ద సంచనలనం. వీటితోపాటు అనేక సినిమాలు బ్లాక్‌ బస్టర్లుగా నిలిచాయి. మరెన్నో సినిమాలు శతదినోత్సవాల్ని దాటేసి సుదీర్ఘకాలం థియేటర్లలో సందడి చేసి రికార్డు సృష్టించాయి. సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలతోపాటు  నవరాత్రి మూవీలో ఏకంగా తొమ్మిది పాత్రలతో మెప్పించి లెజెండ్‌ అనిపించుకున్నారు. ఇక లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ కింగ్‌గా మహిళా ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్నారు. తనదైన స్టెప్పులతో ప్రేక్షకులతో ఈలలు వేయించుకున్నారు. 75 వసంతాలకు పైగా వెండితెరను సుపంపన్నం చేసిన ఆయన సినిమాలు అప్పటికి ఇప్పటికీ ఏనాటికీ చిరస్మరణీయమే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top