అజిత్ కుమార్‌ యాక్షన్‌ థ్రిల్లర్.. 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' ఎలా ఉందంటే? | Ajith Kumar Good Bad Ugly Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Good Bad Ugly Movie Review: అజిత్‌ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. ఆడియన్స్‌తో గుడ్ అనిపించిందా?

Apr 10 2025 5:41 PM | Updated on Apr 10 2025 7:14 PM

Ajith Kumar Good Bad Ugly Movie Review In Telugu

టైటిల్: గుడ్ బ్యాడ్‌ అగ్లీ

నటీనటులు:  అజిత్‌ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్‌ తదితరులు

దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్

నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్

ఎడిటర్: విజయ్‌ వేల్‌కుట్టి

సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం

సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్

విడుదల తేదీ:  ఏప్రిల్ 10, 2025

విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్‌ ‍‍‍అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్‌.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్‌ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గుడ్‌ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..

ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ ఏకే(అజిత్‌ కుమార్) అలియాస్‌ రెడ్ డ్రాగన్‌. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్‌. అలా వరల్డ్‌ ఫేమస్ గ్యాంగ్‌స్టర్‌ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్‌ దేవ్‌) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వ‍చ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్‌.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న ‍అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్‌ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్‌ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ ‍అగ్లీ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్‌, వయోలెన్స్‌ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్‌ చేశాడు డైరెక్టర్‌. యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్‌ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్‌ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్‌ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్‌ స్టైల్లో చూపించారు. టాలీవుడ్‌ నటుడు సునీల్‌ స్టైల్‌ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.

జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే ‍అజిత్‌ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్‌ ఫైట్‌ సీన్‌తో బ్యాంగ్‌ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్‌ దాస్‌(జానీ)కి సంబంధించిన ట్విస్ట్‌ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్‌ ఆడియన్స్‌ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్‌ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.


ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్‌ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్‌ డ్రాగన్‌ టీమ్‌ చేసే ఫైట్స్‌ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 

అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్‌(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్‌ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. ‍క్లైమాక్స్ సీన్‌ వచ్చేసరికి.. అర్జున్‌ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్‌ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్‌ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్‌ బ్యాడ్‌ ‍అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్‌. యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.

ఎవరెలా చేశారంటే..

యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్‌ హీరోయిన్‌గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్‌స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్‌  తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్‌ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్‌ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్‌ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. 

 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement