
సుమంత్, కాజల్ చౌదరి, అడివి శేష్
‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్‌పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. సుమంత్ కుమార్, కాజల్ చౌదరి జంటగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ నెల 15న విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రామ్‌పాత్ర కంటతడి పెట్టించింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు..ఒక జీవితం’’ అన్నారు. సుమంత్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మేము అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాకి వస్తున్న స్పందన చూసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినీ ప్రపంచానికి నన్ను, మా టీమ్‌ను పరిచయం చేసిన చిత్రం ఇది’’ అన్నారు సన్నీ సంజయ్. ‘‘ఇంత పెద్ద సక్సెస్ సుమంత్‌గారి వల్లే సాధ్యమైంది’’ అని రాకేశ్ రెడ్డి గడ్డం తెలిపారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడారు.