చిత్ర పరిశ్రమలో వారసుల తెరంగేట్రం అన్నది సర్వసాధారణ విషయం. అలా ఇప్పుడు నటి ఊర్వశి వారసురాలు కథానాయకిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. మాలీవుడ్‌కు చెందిన ఊర్వశి మాతృభాషతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి పేరుగాంచారు. 45 ఏళ్లుగా కళామతల్లికి సేవలు అందిస్తున్న ఊర్వశి మలయాళ నటుడు మనోజ్ కె.జయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. వీరికి తేజలక్ష్మి అనే కూతురు ఉంది. ఈ బ్యూటీ ఇప్పుడు కథానాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు కె.భాగ్యరాజ్ దర్శకత్వంలో ముందనేముడిచ్చి చిత్రం ద్వారా ఊర్వశి కథానాయకి కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

అయితే ఈమె కమలహాసన్‌ను తన గురువుగా భావిస్తారు. ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. త్వరలో కథానాయకిగా పరిచయం కాబోతున్న తేజలక్ష్మి కమలహాసన్ ఆశీస్సులు పొందడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారట. దీంతో కూతురు కోరికను నెరవేర్చడానికి ఇటీవల ఊర్వశి ఆమెను తీసుకొని కమలహాసన్ ఇంటికి వెళ్లారు.
అలా ఆయన ఆశీస్సులు పొందిన తేజలక్ష్మి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తాను చిన్నతనంలో కమలహాసన్ నటిస్తున్న చిత్రాలు షూటింగ్‌కు ఆమ్మతో కలసి వెళ్లేదాన్నని ,అప్పుడు కమలహాసన్ షూటింగ్ విరామం సమయాల్లో తనను ముద్దాడుతూ తిప్పేవారన్న విషయాన్ని అమ్మ చెప్పేది అన్నారు. దీంతో ఇటీవల కమల్‌ను కలుసుకోవాలని కోరిక బలంగా ఏర్పడిందన్నారు. అది నెరవేరడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఊర్వశి, తేజలక్ష్మి కమలహాసన్‌తో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


