ఒకప్పుడు హిట్ సినిమాల హీరోయిన్.. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ ఏజెంట్. భారత్ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్‌కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్‌గా లైమ్ లైట్‌లోకి వచ్చింది. తనే హీరోయిన్ రిమీ సేన్.
భారత్‌లో అలా లేదు
హీరోయిన్ రిమీ సేన్ మాట్లాడుతూ.. దుబాయ్ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్‌లో లేదు. భారత్‌లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.
అనుకూలంగా లేదు
దీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్‌లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.
సినిమా
రిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్‌లో హంగామా, ధూమ్, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్, ఫిర్ హేరా ఫేరీ, గోల్‌మాల్ 2, ధూమ్ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్‌బై చెప్పేసింది. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్‌లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.


