
నచ్చినవారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇంకొన్నాళ్లయినా వారు తమతోనే ఉంటే బాగుండని బాధపడేవాళ్లు చాలామంది. బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) ఏళ్ల తరబడి అలాంటి బాధను అనుభవిస్తోంది. ఆమె తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి ఫ్రాంక్ హ్యాండ్రిచ్‌ను కోల్పోయింది. నాన్న చిన్నవయసులోనే వదిలిపెళ్లిపోయాడని, ఆయన ఇంకొంతకాలం తనతో ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకుంది.
అన్నీ కళ రూపంలోనే..
ఈ క్రమంలో తండ్రి ఫ్రాంక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను తల్చుకుని భావోద్వేగానికి లోనైంది. నేను గట్టిగా అరవాలనుకున్నప్పుడు ఏదైనా పెయింటింగ్ వేసేవాడినని నాన్న చెప్తూ ఉండేవాడు. ఆయన గొంతుక, ప్రార్థన, నిరసన.. అన్నీ కూడా కళ రూపంలోనే ప్రదర్శించేవాడు. తన మెదడులో తిరిగే భావాలను, ప్రపంచంలోని గొడవలను అన్నింటినీ కళగానే ముందుంచేవాడు. దాన్నొక బాధ్యతగా భావించేవాడు.
చీమ నేర్పే పాఠాలు
అలాగే ప్రకృతితోనూ మమేకమయ్యేవాడు. చీమ పనితనం గురించి, అది మనకు నేర్పించే పాఠాల గురించి ఎక్కువగా చెప్పేవాడు. అవి ఎప్పుడూ కలిసికట్టుగా పని చేస్తూనే ఉంటాయి కానీ ఫిర్యాదులు చేయవని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పనిని ఆపవు అని చెప్పేవాడు. తనకన్నా 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందనేవారు. ఆ చీమలు మనకు ఐకమత్యం, క్రమశిక్షణతో పాటు ఏ పనీ చిన్నది కాదని నేర్పిస్తాయన్నమాట!
వచ్చే జన్మలో అయినా..
హ్యాపీ బర్త్‌డే పప్పా.. మరో జన్మంటూ ఉంటే మనిద్దరం ఎక్కువకాలం కలిసుందాం. అప్పటివరకు నిన్ను నా ప్రతి అడుగులోనూ తలుచుకుంటూనే ఉంటాను అని రాసుకొచ్చింది. హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఆమె తెలుగులో వైల్డ్ డాగ్ మూవీలో యాక్ట్ చేసింది.