బాలీవుడ్లో అగ్ర కథానాయికల్లో ఒకరైన దీపికా పదుకోన్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇండియాలోనే పాపులర్ హీరోయిన్‌గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ (రూ. 20 నుంచి 30 కోట్లు) ఒక్కో సినిమాకు అందుకునే నటిగా కొనసాగుతున్నారు. అయితే, నటిగా కెరీర్ మొదలుపెట్టిన పదిహేడేళ్లకు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో దీపికా పదుకోన్ తెలుగు తెరపై కనిపించారు. హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ మూవీలోని సుమతి పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే, సీక్వెల్లో ఆమె నటించలేదు.
ఛాన్స్లు పోయినా సరే ఎక్కడా తగ్గన దీపిక
పని గంటలు విషయంలో ఆమె షరతులు పెట్టారని అందుకే కల్కి-2 నుంచి మేకర్స్ తొలగించారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ నుంచి కూడా చర్చల దశలోనే ఆమెను తప్పించారని టాక్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్‌కు దిగారు. కానీ, తను మాత్రం ఎక్కడా కూడా తిరిగి వారికి కౌంటర్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి 8 గంటలకంటే ఎక్కువగా పనిచేయడం కష్టమని ఆమె పదేపదే అన్నారు. అదే మాటపై కట్టుబడుతానని బహిరంగంగా చెప్పారు. అలా ఒప్పుకున్న వారితోనే కలిసి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత తను చేసిన వ్యాఖ్యలను చాలామంది మేకర్స్ సమర్ధించారు కూడా.. ఈ క్రమంలో తనకు కొన్ని సినిమా ఛాన్సులు కూడా పోయాయి. అయినప్పటికీ తను ఎంతమాత్రం తగ్గలేదు. అయితే, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ సినిమాలో దీపికా నటిస్తున్నడం విశేషం. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరిగా దూసుకెళుతున్నారు దీపికా పదుకోన్. ‘ఐశ్వర్య’ (2006) అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ రెండు దశాబ్దాల కెరీర్‌కి చేరువ అవుతున్నారు. కన్నడ, హిందీ, తమిళ, తెలుగు, ఇంగ్లిష్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారామె. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో ఏడడుగులు వేశారు. 2018 నవంబరు 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా దీపిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్లను సొంతం చేసుకుని, ఔరా అని ఆశ్చర్యపరిచారామె.
ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకోన్ పేరు టాప్ ప్లేస్‌లో ఉండటం విశేషం. పైగా పెళ్లయినప్పటికీ హిందీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా కంటిన్యూ అవుతున్నారీ బ్యూటీ. రణ్వీర్–దీపిక దంపతులకు దువా పదుకోన్ సింగ్ అనే పాప ఉంది. 2024లో అమ్మగా ప్రమోషన్ పొందారు దీపిక. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆమె సినిమాలకు కొంచెం విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎలాగూ బిజీ అవుతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కింగ్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఉంది.
8గంటల పనిపై దీపికా వివరణ
‘‘నేనో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారిపై మరింత గౌరవం పెరిగింది. వృత్తి జీవితాన్ని, పిల్లల పెంపకాన్ని బ్యాలెన్స్ చేయొచ్చని చాలామంది అంటుంటారు. కానీ అది చాలా కష్టమైన పని. కొత్తగా తల్లయిన వారు తిరిగి పనికి వచ్చినప్పుడు వారికి అందరూ సపోర్ట్ చేయాలి’’ అని దీపికా పదుకోన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు 8 గంటలు మాత్రమే పని చేసే వెసులుబాటును కల్పించాలని దీపిక కొంత కాలంగా పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో మరోమారు ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ– ‘‘రోజుకి 8 గంటల పని మానవ శరీరానికి, మనసుకు సరిపోతుంది.
మనం ఆరోగ్యంగా ఉండి, పని చేసినప్పుడే అవుట్‌పుట్ బాగా వస్తుంది. ఒత్తిడితో పని చేస్తే సరైన ఫలితం రాకపోవచ్చు. మా ఆఫీసులో సోమవారం నుంచి శుక్రవారం వరకు మేం 8 గంటలే పని చేస్తాం. వినేవారికి బోరింగ్‌గా ఉండొచ్చు. టైమ్ అనేది మన చేతుల్లో ఉన్న ధనంతో సమానం. దీన్ని ఎవరితో, ఎప్పుడు, ఎలా స్పెండ్ చేయాలని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే. 8 గంటలు మాత్రమే పని చేయాలనే నా నిర్ణయం కరెక్టే’’ అని చెప్పుకొచ్చారు దీపికా పదుకోన్.


