
రేసుగర్రం విలన్ రవికిషన్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించారు. సినిమాల మీద ఆసక్తితో రూ.500 నోటుతో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డ ఆయన రానురానూ తన టాలెంట్‌తో గుర్తింపు సంపాదించారు. భోజ్‌పురి, హిందీ చిత్రపరిశ్రమలో టాప్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
కటిక పేదరికం
తాజాగా రవికిషన్ (Ravi Kishan) ఓ పాడ్‌కాస్ట్‌లో తన బాల్యంలోని బాధల్ని చెప్పుకొచ్చారు. నేను కటిక పేదరికం అనుభవించాను. చాలాసార్లు నా జీవితాన్ని అసహ్యించుకునేవాడిని. మా ఇంట్లో 12 మంది ఉండేవాళ్లం. కొద్దిపాటి బియ్యంతో నీళ్లలా చేసే కిచిడీని కుటుంబమంతా తినేవాళ్లం. చిన్నగదిలోనే మేమందరం పడుకునేవాళ్లం. ఒక్కోసారి ఒకరిపై మరొకరం నిద్రించేవాళ్లం.
ఆరోజే అనుకున్నా
పేదరికంలో ఉన్న మమ్మల్ని చూసి చాలామంది వెక్కిరించారు. నా తండ్రిని ఎవరూ హేళన చేయకూడదని, ఆ స్థాయికి నేను చేరుకోవాలని చిన్నతనంలోనే బలంగా నిశ్చయించుకున్నాను. ఈ భూమి మీదకు వచ్చామంటే ఏదో ఒకటి చేసి పోవాల్సిందే! అంతేకానీ పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా అనామకులుగా చనిపోతే ఏం లాభం? కేవలం పిల్లల్ని కనడానికో, బంగ్లాలు కట్టడానికో ఈ భూమిపైకి రాలేదు కదా! మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి. ఒక్కసారి మనకు పేరు వచ్చిందంటే డబ్బు దానంతటదే వస్తుందని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చారు.
డబ్బు లేకపోతే..
ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ.. ప్రతిరోజు జిమ్‌కు వెళ్లండి, అంత డబ్బు లేదంటే రోడ్డుపై పరిగెత్తండి. కనీసం 3-5 కి.మీ అయినా పరిగెత్తండి, 200 పుషప్స్ చేయండి. శనగలను రాత్రంతా నానబెట్టి తెల్లారి ఆ నీళ్లను తాగండి, శనగలను తినండి. మీరు పేదవాళ్లయినప్పటికీ ఇవన్నీ చేయొచ్చు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే నిత్యావసర సరుకులను ఇలా వాడుకోవచ్చు. కనీసం సూర్యోదయానికి ముందు లేవడమైనా అలవాటు చేసుకోండి అని సూచించారు.
సినిమా
పీతాంబర్ (1992) సినిమాతో రవికిషన్ సినీప్రయాణం ఆరంభమైంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేశారు. తెలుగులో రేసుగుర్రం, కిక్ 2, హీరో, 90 ఎమ్‌ఎల్, డాకు మహారాజ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.