
శివాజీనగర: మైసూరు శాండల్ సబ్బుల ప్రచారకర్తగా నటి తమన్నాను నియమించడంపై కన్నడ నేతలు, తారల ఆగ్రహం కొనసాగుతోంది. నటి, మాజీ ఎంపీ రమ్య కూడా అసమ్మతిని వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగుడు మైసూరు శాండల్ సోపు రాయబారి అని అన్నారు. ఈ పాత్ర కోసం తమన్నాకు కోట్లాది రూపాయాలను చెల్లింపు వెనుక తర్కాన్ని ప్రశ్నించారు.
సెలిబ్రిటీల ప్రచారం కోసం సర్కారు ప్రజల సొమ్మును ఖర్చు చేయడం తగదన్నారు. సోపు రుద్దితే తెల్లగా కారు, సెలిబ్రిటీలు చెబితే ప్రజలు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే రోజులు చాలా ఏళ్ల క్రితమే గతించాయని శనివారం సోషల్ మీడియాలో చెప్పారు. ఒక ఉత్పత్తి నిజంగా విలువైనదైతే అందరూ కొంటారన్నారు. మైసూరు శాండల్‌పై ఇప్పటికే ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని, తమన్నా ప్రచారం అవసరం లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు.