తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'తిరంగా కా సురక్ష' పేరుతో శుక్రవారం ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న తెలుగు హీరో నాగార్జున.. తానూ సైబర్ క్రైమ్ బాధితుడినేనని చెప్పి షాకిచ్చారు. నాలుగేళ్ల క్రితం సైబర్ ఫ్రాడ్‌కి గురయ్యానని, బ్యాంక్ అధికారి పేరుతో కాల్ వచ్చిన సంగతి బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు: ఉప్పల్ బాలు)
'మేం ఇంజనీరింగ్ చదివే టైంలో అంటే 1977లో అపుడే కంప్యూటర్స్ వచ్చాయి. మా కాలేజీ రోజుల నుంచే మెయిల్ అకౌంట్స్ మాల్ వేర్స్, హ్యాకింగ్ జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్లు హెచ్చరించేవారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ క్రైమ్ సమస్య కొనసాగుతూనే ఉంది. నేను కూడా సైబర్ ఫ్రాడ్ బాధితుడినే. ఐదేళ్ల క్రితం బ్యాంక్ ఆఫీసర్‌నని ఓ వ్యక్తి కాల్ చేశాడు. మార్కెటింగ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి నన్ను ఇన్వెస్ట్‌మెంట్ గురించి బలవంతం చేశాడు. అంతెందుకు మాయమాటలతో మా కుటుంబంలోనే కొందరిని ఆరు ఏడు గంటల పాటు డిజిటల్ అరెస్ట్ కూడా చేశారు'
'విదేశాలకు నార్కోటిక్ సబ్‌స్టాన్స్ పార్సిల్ పేరుతో కాల్స్ చేసేవారు. అయితే సైబర్ క్రైమ్ నేరాలని అరికట్టడంలో దేశంలోనే తెలంగాణ సైబర్ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. నేను వారానికి ఒకసారి మొబైల్ పాస్ వర్డ్, నెలకోసారి వైఫై పాస్‌వార్డ్స్ మారుస్తూ ఉంటాను. నా మొబైల్‌లో కనీసం ఫొటోలు కూడా తీసుకోను. ఇండస్ట్రీలో పైరసీ అరికట్టడం కోసం సీవీ ఆనంద్, సజ్జనార్ ఎంతగానో కృషి చేశారు. ఈ విషయంలోనూ తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. ఇతర దేశాలకు వెళ్లి మరీ సైబర్ నేరస్థులని పట్టుకుని అరెస్ట్ చేశారు. జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరాలని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది' అని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా రివ్యూ)


