Top Gear Movie Review: 'టాప్ గేర్' మూవీ రివ్యూ

Aadi Sai Kumar Top Gear Movie Review - Sakshi

టైటిల్: టాప్ గేర్‌
నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, బ్రహ్మజీ, సత్యం రాజేశ్, మైమ్ గోపీ, శత్రు, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్‌ చంద్ర
నిర్మాణ సంస్థలు:ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌
నిర్మాత: కేవీ శ్రీధర్‌ రెడ్డి
దర్శకత్వం: కె.శశికాంత్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్,
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
విడుదల తేదీ: డిసెంబర్ 30,2022

యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మించారు.  'టాప్ గేర్'సినిమాతో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు ఆది. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

అసలు కథేంటంటే:
ఆది సాయికుమార్(అర్జున్) ఓ క్యాబ్‌ డ్రైవర్. రియా సుమన్(ఆద్య)ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తుంటాడు. కొత్తగా పెళ్లైన దంపతులు కావడంతో చాలా అన్యోన్యంగా ఉంటారు. మైమ్‌ గోపీ(సిద్ధార్థ్‌) డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటాడు. ఇతని ముఠాలో బ్రహ్మజీ, సత్యం రాజేశ్‌ కూడా ఉంటారు.

డ్యూటీకి వెళ్లిన అర్జున్‌ ఇంటికొస్తుండగా ఓ క్యాబ్‌ బుకింగ్‌ ఆర్డర్‌ వస్తుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అనుకోకుండా ఆరోజు అతని క్యాబ్‌లో ఇద్దరు వ్యక్తులు ఎక్కుతారు. ఆరోజు రాత్రి అర్జున్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అతనికి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పాలని భార్య ఆద్య ఇంటి దగ్గర నిరీక్షిస్తూ ఉంటుంది. కానీ ఆరోజు రాత్రి అర్జున్‌ ఇంటికెళ్లాడా? ఆ గుడ్‌ న్యూస్‌ విన్నాడా? అసలు క్యాబ్‌లో ఎక్కిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ తర్వాత అర్జున్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? డ్రగ్స్‌ ముఠాకు, హీరోకు సంబంధం ఏంటీ? అర్జున్‌ను పోలీసులు ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. 

కథ ఎలా సాగిందంటే..
డ్రగ్స్‌ ముఠా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విలన్‌ ఇంట్రడక్షన్‌తోనే కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఆది, రియా సుమన్‌ పెళ్లి, దంపతుల మధ్య రొమాంటిక్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో ఎలాంటి పరిచయం లేకుండానే డైరెక్ట్‌గా పాత్రలను రంగంలోకి దించారు డైరెక్టర్. జీవనం సాఫీగా నడుస్తున్న క్యాబ్‌ డ్రైవర్‌ జీవితంలోకి డ్రగ్స్‌ ముఠా ఎంట్రీ కావడం, ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండానే కథ సాగడం ప్రేక్షకుల కాస్త బోర్ కొట్టించింది. డ్రగ్స్‌ ముఠాను పట్టుకునేందుకు పోలీసుల ఆపరేషన్‌ చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఫస్టాఫ్‌ ఓ రొమాంటిక్‌ సాంగ్ మినహా ఎలాంటి యాక్షన్ సీన్స్‌, కామెడీ లేకుండానే ముగుస్తుంది.

సెకండాఫ్‌కు వచ్చేసరికి కథలో వేగం పెంచారు. డ్రగ్స్ ముఠా, హీరో మధ్య సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కథలో డేవిడ్‌ అనే పాత్రే అసలు ట్విస్ట్. సెకండాఫ్‌ మొత్తం డ్రగ్స్ ఉన్న బ్యాగ్‌ చుట్టే కథ నడిపించారు. మధ్యలో అక్కడక్కడ కొత్త పాత్రల ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెంచారు. డ్రగ్స్ ముఠా, పోలీసులు, హీరో చుట్టే సెకండాఫ్‌ తిరుగుతుంది.

మధ్యలో ఓ యాక్షన్‌ ఫైట్‌, డ్రగ్స్ బ్యాగ్‌ కోసం హీరో అర్జున్‌(ఆది) చేసే సాహసం హైలెట్. ఒకవైపు యాక్షన్‌ సన్నివేశాలు చూపిస్తూనే.. మరోవైపు భార్య, భర్తల ప్రేమానురాగాలను డైరెక్టర్‌ చక్కగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ నవ్వులు తెప్పించడం ఖాయం. సీరియస్‌ సీన్లలో కామెడీ పండించడం శశికాంత్‌కే సాధ్యమైంది. ఓవరాల్‌గా మనుషుల ఎమోషన్స్‌తో ఇతరులు ఎలా ఆడుకుంటారనే సందేశాన్నిచ్చారు డైరెక్టర్‌. అలాగే డ్రగ్స్‌ బారినపడి యువత జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే సందేశమిచ్చారు డైరెక్టర్.

ఎవరెలా చేశారంటే..
ఆది సాయికుమార్ ‍యాక్షన్ బాగుంది. క్యాబ్‌ డ్రైవర్‌ పాత్రలో ఆది సాయికుమార్ ఒదిగిపోయాడు. రియా సుమన్ నటనతో ఆకట్టుకుంది. రొమాంటిక్‌ సన్నివేశాల్లో అదరగొట్టింది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. విలన్‌గా మైమ్‌ గోపీ(సిద్ధార్థ్‌) ఆకట్టుకున్నారు. శత్రు(ఏసీపీ విక్రం) పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్, బెనర్జీ, వంశీ, ఆర్జే హేమంత్, చమ్మక్‌ చంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం సినిమాకు ప్లస్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు.ఆదిత్య మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌ నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top