
‘‘ది 100’ చిత్రంలో ప్రతిపాత్రకి ప్రాముఖ్యత ఉంది. సినిమాని థియేటర్స్‌లో చూడండి... ఏ ఒక్కర్నీ నిరుత్సాహ పరచదు. మా సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం... అంత నమ్మకంగా చెబుతున్నాను’’ అని ఆర్‌కే సాగర్ అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఆర్‌కే సాగర్, మిషా నారంగ్ జోడీగా ధన్యా బాలకృష్ణ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘ది 100’. రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో ఆర్‌కే సాగర్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ఆర్‌కే నాయుడుపాత్రలాగే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకి నచ్చింది.
ఇంకా మంచి కథలు చెప్పాలనే స్ఫూర్తిని ప్రేక్షకులు ఇచ్చారు’’ అని తెలిపారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ– ‘‘సమాజంలోని సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్‌లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది’’ అని రమేశ్ కరుటూరి తెలిపారు. మిషా నారంగ్, నటుడు రాజా రవీంద్ర,పాటల రచయిత రాంబాబు గోసాల మాట్లాడారు.