హవేళిఘణాపూర్(మెదక్): బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రుబీనా ఫాతిమా హెచ్చరించారు. శుక్రవారం అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి హెడ్ పోస్టాఫీస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరమని, పిల్లలు ఆనారోగ్యానికి గురై వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహాలు చేసినట్లయితే వెంటనే 1098, 100కు కాల్ చేసి వివరాలు అందించాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, పట్టణ సీఐ మహేశ్, కరుణాకర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఉప్పలయ్య, విజన్ ఎన్జీఓస్ సభ్యులు నవనీత పాల్గొన్నారు.


