ఉద్యానసాగుకు ఊతం | - | Sakshi
Sakshi News home page

ఉద్యానసాగుకు ఊతం

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

ఉద్యానసాగుకు ఊతం

జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంగా వరి తప్ప, ఆరుతడి పంటల సాగు అంతంతే. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈఏడాది ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో ఉద్యాన సాగును పెంచేందుకు ఆశాఖ అధికారులు రైతులకు దండిగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. వీటిలో 50 నుంచి మొదలుకుని 100 శాతం వరకు రాయితీలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్‌పాం సాగుకు మంచి డిమాండ్‌ ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. మొక్కలు, డ్రిప్పు, ఎరువులతో పాటు 4 ఏళ్ల పాటు సంరక్షణకు ఎకరానికి రూ. 50 వేల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ. 48 వేల చొప్పున సబ్సిడీ ఇస్తుంది. ఇందులో రైతు వాటా కేవలం రూ. 2 వేలు మాత్రమే కావటంతో ఈ ఏడాది 1,170 ఎకరాలకు రైతులు డీడీలు చెల్లించారు. ఇప్పటి వరకు 800 ఎకరాల్లో సాగు చేశారు. మరో 3 నెలల్లో మిగతా సాగు పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే డ్రిప్పుకు ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీ, సన్న, చిన్న కారు రైతులకు 80, ఇతరులకు 70 శాతంపై సబ్సిడీపై ఇస్తున్నారు. స్ప్రింక్లర్లు మాత్రం అన్ని వర్గాల రైతులకు 65 శాతం రాయితీపై అందజేస్తున్నారు. ఇందులో ఒక్కో రైతుకు కేవలం 12.20 గుంటల చొప్పున మాత్రమే ఇస్తున్నారు.

కూరగాయల సాగుకు పెద్దపీట

జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కూరగాయల పంటలను రైతులు అత్యధికంగా పండించారు. ఇప్పటి వరకు 1,330 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కేవలం 600 ఎకరాల్లో మాత్రమే సాగు కాగా, ఈ ఏడాది రెండింతలు పెరిగింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 150 ఎకరాలకు సరిపడా టమాట, వంకాయ, పచ్చిమిర్చి నారును 100 శాతం సబ్సిడీపై రైతులకు సరఫరా చేశారు. ఉల్లి నారును 300 మంది రైతులకు ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున అందజేశారు. ఉల్లి సాగుకు ఎకరాకు రూ. 8 వేల చొప్పున సబ్సిడీ ఇచ్చారు.

45 ఎకరాల్లో మల్చింగ్‌

జిల్లావ్యాప్తంగా 45 ఎకరాల్లో మల్చింగ్‌ సాగు చేశారు. ఎకరాకు రూ. 16 వేల ఖర్చు వస్తుండగా, రూ. 8 వేల చొప్పున 45 ఎకరాలకు రూ. 3.60 లక్షల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే మామిడి, జామ తోటలు 50 ఎకరాల్లో సాగు చేయగా, ఒక్కో ఎకరాకు రూ. 19,500 చొప్పున రాయితీని రైతులకు అందించారు. శాశ్వత పందిరి సాగును 4 ఎకరాల్లో సాగు చేయగా, ఒక్కో ఎకరానికి రూ. 3 లక్షల ఖర్చువుతుంది. ఎకరాకు రూ. లక్ష చొప్పున సబ్సిడీని అందజేశారు.

రైతులకు దండిగా ప్రోత్సాహకాలు

కూరగాయల నుంచి ఆయిల్‌పాం వరకు సబ్సిడీలు

రాయితీపై డ్రిప్పు పరికరాలు, స్ప్రింక్లర్లు

జిల్లాలో 1,330 ఎకరాల్లో పంటలు

ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో ఉద్యాన సాగును విస్తరించేందుకు ఆశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కూరగాయల నుంచి మొదలుకొని ఆయిల్‌పాం వరకు ప్రత్యేక రాయితీలు అందజేస్తుంది. ఇందులో కొన్నింటికి 100 శాతం ఇస్తుండగా, మరికొన్నింటికి 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. దీంతో రైతులు స్వచ్ఛందంగా సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఆశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – మెదక్‌జోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement