జిల్లాలోని మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి, రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. ఈనాలుగు కళాశాలకు ప్రిన్సిపాల్‌గా హుస్సేన్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మెదక్ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తుండగా, మిగతా మూడు కాలేజీలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ‘ఒక్కరే ప్రిన్సిపాల్– నాలుగు కళాశాలు’ విధానంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రోజుల తరబడి ఆలస్యం
● నాలుగు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమయ్యే బోనాఫైడ్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులపై ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి. అయితే ప్రిన్సిపాల్ లేకపోవడంతో రోజుల తరబడి ఆలస్యం జరుగుతుంది.
● అత్యవసర సమయాల్లో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇబ్బందులపాలవుతున్నారు.
● కళాశాలల్లో నిరంతర పర్యవేక్షణ కొరవడి తరగతులు సక్రమంగా జరుగడం లేదనే ఆరోపణలున్నాయి.
● ఈ ప్రభావం నేరుగా విద్యార్థుల చదువుపై పడుతుంది.
● కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌ల నిర్వాహణ వంటి సమస్యలకు నిధుల మంజూరులో జాప్యం జరిగే అవకాశం ఉంది.
● సీనియర్ అధ్యాపకులకు రోజువారీ పరిపాలన బాధ్యతలు అప్పగిస్తుండటంతో బోధనకు ఆటంకం కలుగుతుంది.
● ప్రతి చిన్న విషయానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అనుమతి కోసం వేచి చూడటం వల్ల అనేక సమస్యలు ఉత్పత్నం అవుతున్నాయి.
నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందజేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పర్యవేక్షణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో ఉన్న నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఒక్కరే ప్రిన్సిపాల్ ఉండటంతో ఈ కళాశాలల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఇబ్బందులపాలవుతున్నారు.
– రామాయంపేట(మెదక్)
డిగ్రీ కళాశాలల్లో పర్యవేక్షణ లోపం
అస్తవ్యస్తంగా ఉన్నత విద్య
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు


