మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్‌రావు
మెదక్ కలెక్టరేట్: పేదలు, రైతులకు బ్యాంకింగ్ సేవలు చేరువ కావాలని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్షా కమిటీ (డీఎల్‌ఆర్సీ) సమావేశంలో కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లతో కలిసి జిల్లాలో బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించాలన్నారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల నమోదును బ్యాంకు అధికారులు వేగవంతం చేయాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బీమా పథకాలలో చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధి హేమలత, నాబార్డ్ డీడీఎం కృష్ణ చైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాంకర్లతో ఎంపీ రఘునందన్‌రావు


