నర్సాపూర్: మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నర్సాపూర్– సంగారెడ్డి మార్గంలో పైపులైన్‌కు లీకేజీ ఏర్పడటంతో శుక్రవారం సాయంత్రం నుంచి పంపింగ్ నిలిపివేసినట్లు తెలిపారు. శనివారం నల్లాల ద్వారా నీరు రాదని చెప్పారు. మరమ్మతులు పూర్తయిన అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ కరణం గణేశ్ రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్– 14, 17, 19 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బోనాఫైడ్ సర్టిఫికెట్‌తో సకాలంలో హాజరుకావాలని సూచించారు.
రామాయంపేట(మెదక్): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే వారి కుటుంబాలు, తద్వారా సమాజం బాగుపడుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని వైశ్యాభవన్‌లో ఉచిత మగ్గం శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. నెల రోజుల పాటు కొనసాగే ఈశిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొదటి బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తామని, అనంతరం రెండో బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మగ్గం వర్క్ నేర్చుకుంటే మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. మనం ఆర్థికంగా ఎదగడంతో పాటు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, వైస్ చైర్‌పర్సన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, స్వప్న, శ్యామల, కో ఆప్షన్ సభ్యురాలు రాధా భవానీ, సీడీపీఓ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: మండలంలోని జుజాల్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇన్‌చార్జి హెచ్‌ఎం జ్యోతి రాథోడ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ రోహిణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలను డీఈఓను తనిఖీ చేసిన సమయంలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే తరగతులకు హాజరైనప్పటికీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌లో మాత్రం 12 మంది ఉన్నట్లుగా నమోదు చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా సమీపంలోని మదర్సా పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థుల హాజరును పాఠశాల విద్యార్థులుగా తప్పుగా నమోదు చేస్తున్నట్లు బహిర్గతమైంది. విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడమే కాకుండా విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేనట్లుగా గుర్తించారు. సస్పెషన్ తక్షణం అమల్లోకి వస్తుందని, విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం విడిచి వెళ్లరాదని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
నారాయణఖేడ్: రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జీ బీఎం సందీప్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గిరిజా షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సందీప్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశా రు. పార్టీ సంస్థాగత బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.


