‘మెప్మా’లో మెక్కేశారు! | - | Sakshi
Sakshi News home page

‘మెప్మా’లో మెక్కేశారు!

Nov 19 2026 1:54 PM | Updated on Nov 19 2026 1:54 PM

ఆర్పీల చేతివాటం

డబ్బులు రికవరీ చేస్తాం

● రామాయంపేట బల్దియాలో రూ. 25 లక్షల గోల్‌మాల్‌

● సొంతానికి ‘సీ్త్ర నిధి’ నిధులు

● ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగిస్తాం: అధికారులు

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) అవినీతిపరులకు ఆదాయ వనరుగా మారింది. తాజాగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 25 లక్షల మేర నిధులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. గత నాలుగేళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్నా ఆశాఖ అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి.

– రామాయంపేట(మెదక్‌)

రామాయంపేట మున్సిపాలిటీలో 335 మహిళా సంఘాలుండగా, 3,350 సభ్యులు ఉన్నారు. ఇటీవల నిర్వహించిన సోషల్‌ అడిట్‌లో నిధుల దుర్వినియోగం విషయం బయటపడింది. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు పలుమార్లు సమావేశం నిర్వహించి డబ్బులు రికవరీకి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సంఘాల్లో సభ్యుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆర్పీలు నిధులను మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం విషయమై సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంతానికి నిధులను వాడుకున్న ఆర్పీలు త్వరలో చెల్లిస్తామని ఉన్నతాధికారుల వద్ద రాత పూర్వకంగా హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది.

నిధుల పక్కదారి ఇలా..

● సంఘాల సభ్యులు చెల్లించిన డబ్బులను ఆర్పీలు వెంటనే బ్యాంకుల్లో జమ చేయకుండా తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లు తెలిసింది. తర్వాత వేరే సంఘాలు చెల్లించిన డబ్బును సర్ధుబాటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

● సంఘాల్లోని చాలా మంది సభ్యులకు బ్యాంకు లావాదేవీలు, పాస్‌ పుస్తకాల్లో ఎంట్రీలు, ఆన్‌లైన్‌ స్టేట్‌మెంట్ల తనిఖీ చేసుకునే అవకాశం లేకపోవడంతో నిధుల దుర్వినియోగానికి దారి తీసింది.

● సభ్యులు చెల్లించిన మొత్తం కాకుండా కొన్ని మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలున్నాయి.

● సంఘాల్లో సభ్యులు సీ్త్రనిధి కింద తాము తీసుకున్న రుణాలను ఆర్పీలకే చెల్లించాలని గతంలో నిబంధనలు ఉండేవి.

● ప్రస్తుతం ఈ వ్యవస్థ మారింది. ఇప్పుడు నేరుగా సభ్యులే యూపీఐ ద్వారా బకాయిలు చెల్లించేలా అవకాశం కల్పించారు.

మెప్మా గ్రూపులకు సంబంధించి డబ్బులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలుంటాయి. ఆర్పీలు వాడుకున్న డబ్బును వెంటనే చెల్లించాలి. ఇప్పటికే వారికి గడువు ఇచ్చాం. చెల్లించనివారిపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయించి డబ్బులు రికవరీ చేస్తాం.

– హన్మంతరెడ్డి, మెప్మా పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement