మెదక్‌జోన్: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) విభాగంలో చేరి ఉద్యోగ రీత్యా 20 ఏళ్లకు పైగా విధులు నిర్వర్తిస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని గురువారం పలువురు ఉద్యోగులు ఎంపీ రఘునందన్‌రావును కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత లభిస్తుందనే ఆశతో ఒక్కొక్కరు రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తున్నా, తమ బతుకులు గాలిలో దీపంలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను రెగ్యులరైజ్ చేయటంతో పాటు మరికొన్ని డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఎంపీని కలిసిన వారిలో వైద్యుడు సాయికిరణ్, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నాయకులు ఉన్నారు.
నర్సాపూర్: విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ హాస్టల్ వెల్ఫేర్ అధికారును ఆదేశించారు. గురువారం పట్టణంలోని పలు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, ఇతర వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): జాతీయస్థాయి అండర్–17 బాలికల క్రికెట్ జట్టుకు శివ్వంపేటకు చెందిన విద్యార్థిని చందనబాయి ఎంపికై ంది. గత నెలలో జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో స్థానం పొందింది. ఈనెల 15 నుంచి జమ్మూకశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టు నుంచి పాల్గొనేందుకు గురువారం బయలుదేరి వెళ్లింది. జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పటాన్‌చెరు: పటాన్‌చెరు బస్టాండ్ మొదటి అంతస్తులో పీఎఫ్ తాత్కాలిక కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పటాన్‌చెరు పీఎఫ్ కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో కలిసి బస్టాండ్ మొదటి, రెండో అంతస్తుల్లో కొత్తగా చేపట్టిన నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి పీఎఫ్ సేవలను స్థానికంగానే కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే కర్ధనూర్‌లో శాశ్వత భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నారాయణఖేడ్: అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు వెళ్లడానికి ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి అద్దె బస్సులు నడుపుతామని డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. 36 సీట్ల కెపాసిటీ గల నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సును కిలోమీటర్‌కు రూ.59, 50 సీట్ల కెపాసిటీ గల ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ. 62, 40 సీట్ల కెపాసిటీ గల డీలక్స్ బస్సుకు రూ.57 చార్జీ టోల్‌గేట్ రుసుముతో కలిపి ఉంటుందన్నారు. ఒక్కో బస్సుకు రూ.300 వెయిటింగ్ చార్జీ, గురుస్వామి బస్సు బుక్ చేస్తే వారికి ప్రయాణ చార్జీ మినహాయింపు ఉంటుందన్నారు.


