రామాయంపేట(మెదక్): జిల్లాను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మెతుకుసీమ కరువు అధ్యయన బృందం డిమాండ్ చేసింది. గురువారం మండలంలోని ప్రగతి ధర్మారం, శివాయపల్లి, సుతారిపల్లి గ్రామాల్లో పర్యటించిన బృందం సభ్యులు ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే జిల్లాలో మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు ప్రాంతంగా ప్రకటించారని అరోపించారు. ఉపగ్రహం చిత్రాల ఆధారంగా కరువును అంచనా వేయడం తగదన్నారు. వాస్తవానికి రామాయంపేట, నిజాంపేట, చిలప్‌చెడ్, హవేళిఘణాపూర్ మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. రైతులు తమ పంటచేలల్లో ఎండిన పంటల ఫొటోలను ప్రజావాణిలో అధికారులకు అందజేయాలని సూచించారు. కోతుల బెడదతో రైతులు ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపడంలేదన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మెతుకుసీమ కరువు అధ్యయన బృందం డిమాండ్


