బెల్టు జోరు.. జనం బేజారు | - | Sakshi
Sakshi News home page

బెల్టు జోరు.. జనం బేజారు

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

మత్తులో జోగుతున్న ‘ఆదర్శ పల్లె’

కల్లు దుకాణాలే అడ్డాలు

రామాయంపేట(మెదక్‌): అది ఆదర్శ గ్రామం.. కనీసం 100 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. అధిక సంఖ్యలో యువత ఉన్నారు. రైల్వేస్టేషన్‌తో పాటు జాతీయ రహదారి (765 డీజీ) గ్రామం మీదుగా వెలుతుండటంతో దినదినాభివృద్ధి చెందుతుంది. చదువుల తల్లి ఒడిలో ఎందరో ప్రభుత్వ ఉద్యోగులను అందించిన పల్లెలో మద్యం ఏరులై పారుతుంది. ఆదర్శ గ్రామం అక్కన్నపేట నేడు బెల్ట్‌షాపులకు నిలయంగా మారింది. ఏకంగా పది వరకు దుకాణాలు కొనసాగుతున్నాయి. మద్యం మత్తులో కొందరు అనైతిక కార్యకలాపాలకు పాల్పడి ఇటీవల జైలుపాలైన సంఘటనలు ఉన్నాయి. కొందరు వ్యాపారుల ధనార్జన మూలంగా నేడు గ్రామానికి చెడ్డపేరు వస్తుందని పలువురు వాపోతున్నారు.

పట్టించుకోని పాలకవర్గం!

గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు అక్రమంగా కొనసాగుతున్నా పంచాయతీ పాలకవర్గం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈవిషయమై గ్రామస్తులు కొందరు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన మొదట్లో పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో మ ద్యం అమ్మకాలు బంద్‌ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎవరైనా మద్యం అమ్మితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇది జరిగిన వారం రోజుల్లోపే గ్రామంలో మళ్లీ అమ్మకాలు ప్రారంభం కావడం గమనార్హం. కాగా, పది మంది వ్యాపారులు బెల్ట్‌షాపులు నిర్వహిస్తుండటంతో గ్రామానికి ఆదాయం సమకూరడం లేదని, వేలం పాట ద్వారా ఒక్కరికే అవకాశం కల్పించాలని కొందరు యువకులు విజ్ఞప్తి చేశారు.

విద్యావంతుల గ్రామంలో మద్యం మత్తు

మార్పు తేవాల్సిన యువతలోనిరాసక్తత

ఎక్కడా లేని విధంగా అక్కన్నపేటలో పదికి పైగా వెలిసిన బెల్ట్‌షాపులు ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రశాంతత దెబ్బతింటుంది. 24 గంటలపాటూ మద్యం అందుబాటులో ఉండటంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. కల్లు దుకాణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగుతున్నారనే ఆరోపణలున్నాయి. సమాజంలో దురాచారాలను రూపు మాపాల్సిన విద్యావంతులు, యువత అధికంగా ఉన్న గ్రామంలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్‌షాపులు ప్రశాంతతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అధికారికంగా మద్యం దుకాణం లేకపోయినా, ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన బెల్ట్‌షాపులతో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులపాలవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement