బోర్ల తవ్వకాలకు బ్రేక్
బోర్ల తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎల్‌నినో ప్రభావంతో తగినన్ని వర్షాలు పడకపోవడంతో రోజు రోజుకు భూగర్భ జలమట్టం పడిపోతోంది. దీంతో భూగర్భ జలమట్టం పడిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వాల్టా చట్టాన్ని కఠినతరం చేయనుంది. బోర్ల తవ్వకాలకు అనుమతులు తప్పని సరి ఉన్నా నీటి వనరులు ఆశించిన మేరకు ఉండటంతో ఇప్పటివరకు అధికారులు చూసీచూడనట్లుగా ఉండిపోయారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతుండటంతో బోరు వేసేందుకు అనుమతులు తప్పనిసరి చేసింది. అనుమతులు లేకుండా బోర్లు వేస్తే వాహనాలను సీజ్ చేసేందుకు అధికారులు సమాయాత్తం అవుతున్నారు. – జహీరాబాద్
రానున్న రోజుల్లో మరింత భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉండటంతో బోర్ల తవ్వకాలపై నిషేధం విధించారు. 2026 వానాకాలం సీజన్లో లోటు వర్షపాతం కారణంగా సంగారెడ్డి జిల్లాలో 28 మండలాలను, సిద్ధిపేట జిల్లాలో 8 మండలాలను, మెదక్ జిల్లాలో ఒక మండలాన్ని కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో కోహీర్, జహీరాబాద్ మండలాలను అత్యంత కరువు మండలాలుగా ప్రకటించగా సిద్ధిపేట జిల్లాలో కోమరవెల్లి మండలాన్ని తీవ్ర కరువు మండలంగా ప్రకటించింది. మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించగా, అదే జిల్లాలో లోటు వర్షపాతం ఉన్న నర్సాపూర్, చిలప్‌చెడ్ మండలాలను మాత్రం కరువు కింద ప్రకటించలేదు.
రిగ్గుల యజమానులకు ఆదేశాలు
బోర్ల తవ్వకాలపై నిషేధం విధించినందున ఎట్టి పరిస్థితుల్లో బోర్లు తవ్వవద్దంటూ రిగ్గుల యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారితో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి నిబంధనలను విధిగా పాటించాలని, లేనట్లయితే రిగ్గులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు అత్యవసరంగా బోర్లు వేయాల్సిన అవసరం ఉంటే అందుకు అధికారులు అనుమతించనున్నారు. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో తాగునీటి అవసరాలకు బోర్లు తవ్వుకునే వెసులుబాటు కల్పించారు.
పారిశ్రామిక అవసరాలకు నో
పరిశ్రమలకు మాత్రం నీటిని సరఫరా చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. పరిశ్రమలకు నీటి వినియోగం అధికం అవుతుండటమే ఇందుకుకారణంగా చెబుతున్నారు. భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించడం అత్యవసరంగా మారింది. దీంతో బోర్ల తవ్వకాలపై రెవెన్యూ, భూగర్భజల శాఖలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
నిబంధనలు కఠినతరం
బోర్ల తవ్వకాలకు ఎలాంటి అనుమతలు ఇవ్వడం లేదు. వాస్తవానికి చట్టప్రకారం బోరు తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇప్పటికే బోరు రిగ్గుల యజమానులకు అదేశాలు జారీ చేశాం. పరిశ్రమలకు నీటిని సరఫరా చేసినా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
–దశరథ్, తహసీల్దార్–జహీరాబాద్
అనుమతులు పొందాల్సిందే!
వ్యవసాయ రంగంతోపాటు వ్యక్తిగత బోర్లు వేసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సిందే. ప్రభుత్వం తాగునీటి కోసం బోర్లు వేయాలన్నా అనుమతులు ఉండాల్సిందే. తెలంగాణ వాటర్–ల్యాండ్ అండ్ ట్రీస్(వాల్టా) చట్టం 2002 ప్రకారం కొత్తగా బోరు తవ్వాలంటే సంబంధిత మండల తహశీల్దార్ల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగం వారు భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, సర్వే నంబర్, బోరు వేయాలనుకునే ప్రదేశం, నీటి వినియోగ అవసరాలతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటి లభ్యతను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇస్తారు. పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు భూగర్భ జలాలను వినియోగించాలంటే సంబంధిత శాఖ నుంచి అవసరమైన ఎన్ఓసీ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీటి సమస్య తలెత్తుతున్నందున వ్యవసాయ, వ్యక్తిగత బోర్ల అనుమతులకు ప్రభుత్వం బ్రేక్ వేసింది.


