జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: రైతులు రహదారులపై వరిధాన్యం ఆరబెట్టి ప్రమాదాలకు తావివ్వొద్దని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై వరిధాన్యం ఆరబెట్టడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశముందని కాబట్టి రైతులు సురక్షిత ప్రాంతాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో పాటు రోడ్లపై రాళ్లు పారవేయడంలాంటి ఘటనలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. చిన్నపాటి తప్పిదానికి పెద్ద ప్రమాదం జరుగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రోడ్లపైనే ధాన్యం కాంటా
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిధిలోని వెంకటపూర్ కె గ్రామంలో రోడ్లపైనే వరి ధాన్యం కాంటాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వెంకటపూర్ కె గ్రామంలో రైతులు ధాన్యం ఆరబోయడానికి, కాంటాలు చేయడానికి సరైన స్థలం లేక రోడ్లపైనే రైతులు ధాన్యం ఆరబోయడంతోపాటు నిర్వాహకులు కాంటాలు నిర్వహిస్తున్నారు. దీంతో కల్వకుంట నుంచి గజ్వేల్ వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో రోడ్లపైనే ధాన్యం సంచులు నిల్వ చేసి ఉంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సొంత భవనాలతో
సేవలు మరింత చేరువ
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడంతో రెవెన్యూ శాఖ సేవలు ప్రజలకు మరింత చేరువ కాగలవని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ...గత నెల 27నాడు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంగారెడ్డి వచ్చినప్పుడు తాను పలు వినతిపత్రాలు అందచేశానన్నారు. నర్సాపూర్‌లో మండల తహసీల్దార్, ఆర్‌డీఓ కార్యాలయాలకు సొంత భవనాలతో పాటు మాసాయిపేటలో మండల తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన విజ్ఞప్తి మేరకు మంత్రి స్పందించి నర్సాపూర్‌లో రెండు కార్యాలయాలకు కంబైండ్‌గా భవనం, మాసాయిపేటలో తహసీల్దార్ కార్యాలయానికి భవనం నిర్మించడానికి నిధులు కేటాయించడం పట్ల సునీతారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఆశ వర్కర్ల సమస్యలు
పరిష్కరించాలి
నర్సాపూర్: ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో డిసెంబరు 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకు మంగళవారం ఆశ వర్కర్ల సమస్యలతో కూడిన వినతిపత్రం అందచేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ...ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలన్నారు. వారికి నెలకు రూ.18వేల వేతనంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశల ఇతర సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో డిసెంబరు 15నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
హుస్నాబాద్: ఢిల్లీ సాహిత్య సదస్సుకు హాజరుకావాలని హుస్నాబాద్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత, జన జాగృతి వ్యవస్థాపకుడు ముక్కెర సంపత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న జాతీయ సదస్సుకు సంపత్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొనేందుకు అంతర్జాతీయ అద్యక్షుడు నల్లా రాధాకృష్ణ ప్రత్యేక ఆహ్వానం అందించారు.


